సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో వీఎంఆర్డీఏపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసని, ఆయన రాజకీయ ఎదుగుదలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణమని అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబుకు వైఎస్సార్ అన్నివిధాలుగా మేలు చేశారని, ఆయన మంత్రి అవ్వడానికి కూడా కారణం వైఎస్సార్ అని తెలిపారు. అలాంటిది చంద్రబాబును చూసి వైఎస్సార్ భయపడాల్సిన అవసరం ఏముందని, బహుశా ఆయన ఆకారాన్ని చూసి ప్రజలు భయపడ్డారేమోనని ఎద్దేవా చేశారు. కాగా చంద్రబాబు జనవరి 1న ఆయన సతీమణితో కలిసి రాజధానిలోని అమ్మవారి దర్శనానికి వెళ్లి.. అమ్మవారికి బంగారు గాజులు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు రాజధాని రైతుల శిబిరాలకు వెళ్లారు.
ఈ విషయం గురించి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఐదేళ్ల చంద్రబాబు పాలనతో రాష్ట్రం మరో ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శిచారు. ఇవ్వాల్సింది రెండు గాజులు కాదని తీసుకున్న భూములని, లక్ష తొంభై కోట్ల రూపాయలతో రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేశారని మండిపడ్డారు. కాగా రాజధాని అంశాలపై ఓ కమిటీని నియమించారని.. ఆ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో అఖిల పక్ష సమావేశంలో విభజనకు చంద్రబాబు సమ్మతించారని గుర్తుచేశారు. రూ.340 కోట్లు కన్సల్టెంట్లకు రాజధాని కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు. అయితే నిపుణులు కమిటీ అసెంబ్లీని అమరావతిలో, సచివాలయం విశాఖలో పెట్టాలని సూచించినట్టు మంత్రి వెల్లడించారు. దేశంలో పెద్ద నగరంగా ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే ముంబై స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆ కమిటీ చెప్పిందని, విశాఖను రాజధాని చేస్తే మొదట చంద్రబాబు సామాజిక వర్గాల వారే ధనవంతులు అవుతారని, సామాజిక వర్గాలు ప్రస్తావన చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment