రాజస్థాన్ సీఎం వసుంధరతో ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్(ఫైల్ ఫొటో)
జైపూర్ : దేశంలో ముస్లిం జనాభా పెరుగుదలపై బీజేపీ శాసనసభ్యుడొకరు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరూ 12-13 మంది పిల్లల్ని కంటోన్న ముస్లింలు.. 2030లోగా దేశాన్ని ఆక్రమించుకుంటారని, ఇది వారు రచించిన భారీ కుట్ర అని ఆరోపించారు. రాజస్థాన్‌లోని అల్వార్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ ఈ మాటలు అన్నారు. కాగా, విద్వేష వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, ఆయన మాత్రం వెనక్కితగ్గబోనన్నారు.
ఉప ఎన్నిక వేళ బీజేపీ విద్వేషం : రాజస్థాన్‌లోని అల్వార్ లోక్‌సభ స్థానానికి జనవరి 29న ఉప ఎన్నిక జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే అయిన బన్వరీలాల్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం తన ఫేస్‌బుక్ ఖాతాలో బన్వరీ ఇలా రాసుకొచ్చారు.. ‘‘హిందువులు కట్టే పన్నులతో ముస్లింలు లబ్ధిపొందుతున్నారు. పెద్ద కుట్ర పన్నే వాళ్లు ఒక్కొక్కరూ 12-13 మంది పిల్లల్ని కంటూ జనాభాను పెంచుకుంటున్నారు. అలా 2030లోగా భారత్‌ను కైవసం చేసుకుంటారు. అప్పుడు హిందువులు ద్వితీయశ్రేణి పౌరులుగా బతకాల్సిఉంటుంది. రాష్ట్రపతి మొదలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు.. అన్ని పదవుల్లో ముస్లింలే ఉంటారు’’
దుమారం.. : బన్వరీలాల్ విద్దేషవ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. మతవిబేధాల్ని రెచ్చగొడుతున్నారని, తక్షణమే వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. కానీ ఆయన మాత్రం తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. ముస్లిం జనాభా పెరుగుదలకు సంబంధించిన ఓ వీడియోను చూసిన తర్వాతే తానీ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. బన్వరీలాల్ వ్యవహారంపై బీజేపీ అదిష్టానం ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment