సాక్షి, చెన్నై : దక్షిణ భారత చలనచిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేట నినాదం మళ్లీ మిన్నంటనున్నది. మంగళవారం నుంచి అభిమానులతో కథానాయకుడు భేటీ కానున్నారు. రోజుకు వెయ్యి మంది చొప్పున ఈనెల 31వ తేది వరకు ఈ భేటీ సాగనున్నది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులు తలై‘వా’ అన్న నినాదాలతో పోస్టర్లను హోరెత్తించే పనిలో పడ్డారు. తమ కథానాయకుడ్ని రాజకీయాల్లోకి లాగేందుకు రజనీ కాంత్ అభిమాన లోకం చేస్తున్న ప్రయత్నాల గురించి తెలిసిందే. అయితే, ఈ స్టార్ ఎక్కడ ఎవ్వరికీ చిక్కడం లేదు. అదే సమయంలో ప్రస్తుతం అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో రజనీ రాజకీయాల్లోకి రావాలన్న నినాదం మళ్లీ తెర మీదకు వచ్చింది.
ఈ ఏడాది మే నెలలో అభిమానులతో రజనీ కాంత్ సమావేశం కావడం, యుద్ధానికి సిద్ధం అవుదామన్న పిలుపు నివ్వడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. అదిగో కొత్త పార్టీ, ఇదిగో కాషాయం కండువ, అదిగదిగో రాజకీయ అరంగ్రేటం అన్నట్టు ప్రచారాలు హల్ చల్ చేశాయి. అయితే, సూపర్‌స్టార్ యధావిధంగా నాన్చుడు ధోరణి అనుసరించారని చెప్పవచ్చు. ఈ గ్యాప్‌లో లోక నాయకుడు కమల్ హాసన్ రాజకీయ ప్రకటన చేయడంతో రజనీ మీద ఒత్తిడిని మరింతగా పెంచే పనిలో అభిమాన లోకం నిమగ్నం అయింది. ఈనెల 12న జరిగిన 68వ బర్త్‌డే వేళ రజనీ రాజకీయ ప్రకటన వెలువడుతుందన్న ఆశతో ఎదురు చూసినా ఫలితం శూన్యం. ఆ రోజున అభిమానులకు దూరంగా రజని గడిపారని చెప్పవచ్చు. ఆ తదుపరి అభిమానులతో మళ్లీ భేటీలు అని తలైవా ప్రకటించడంతో రాజకీయ చర్చ ఊపందుకుంది. అయితే, ఈ సారి రజనీ కీలక ప్రకటన చేయవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
నేటి నుంచి అభిమానులతో భేటీలు: అభిమానుల్ని పలకరించేందుకు రజనీ మళ్లీ సిద్ధం అయ్యారు. రోజుకు వెయ్యి మందిని కలవనున్నారు. మంగళవారం నుంచి 31వ తేది వరకు ఐదు రోజుల పాటుగా ఆయన అభిమానులతో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గడపనున్నారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా జిల్లాల్లోని అభిమాన సంఘాల నేతృత్వంలో అభిమానులకు ఇప్పటికే గుర్తింపు కార్డులు, పాస్‌లు అందజేశారు. ఆ మేరకు తొలిరోజు కాంచీపురం, తిరువళ్లూరు, కృష్ణగిరి, ధర్మపురి, నీలగిరి జిల్లా అభిమానులతో రజనీ బేటీ సాగనున్నది.
27న నాగపట్నం, తిరువారూర్, పుదుకోట్టై, రామనాథపురం, 28న మదురై, విరుదునగర్, నామక్కల్, సేలం, 29న కోయంబత్తూరు, తిరుప్పూర్, వేలూరు, ఈరోడ్ అభిమానుల్ని కలవనున్నారు. 30, 31 తేదిలలో చెన్నైలోని అభిమానులకు కేటాయించడం గమనార్హం. అభిమానులతో ఫొటోలు, ప్రసంగాలు వంటి ప్రక్రియతో పాటుగా రాజకీయ ప్రవేశ అభిప్రాయ సేకరణ కూడా సాగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ భేటీల తర్వాత రజనీ రాజకీయాల్లోకి తప్పకుండా వస్తారని, తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే, తలైవా రాజకీయాల్లోకి రా.. అన్న నినాదంతో చెన్నైలో పోస్టర్లు హోరెత్తించే పనిలో అభిమానలోకం నిమగ్నమైంది. ఇదిలా ఉండగా, రజనీకాంత్ తన అభిమానుల్ని కలవనున్న నేపథ్యంలో తాను సైతం అన్నట్టు కమల్ కూడా ప్రయత్నల్లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రాజకీయ ప్రకటన చేసిన కమల్ జనవరిలో అభిమానులతో భేటీ తదుపరి పార్టీ ప్రకటన చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment