సాక్షి, ముంబై : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ ఎట్టకేలకు క్షమాపణలు తెలియజేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా గాయపరిచి ఉంటే క్షమించాలంటూ సోమవారం మీడియా సాక్షిగా ఆయన కోరారు. మహిళలను గౌరవానికి భంగం కలిగించటం తన అభిమతం కాదని ఆయన అన్నారు.
ఫడ్నవిస్ కేబినెట్‌లో ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రి(ఇన్‌ఛార్జ్) గా ఉన్న గిరీశ్ మద్యం విక్రయాలు పెరగాలంటే వాటి బ్రాండ్‌లకు అమ్మాయిల పేర్లు పెట్టాలంటూ వ్యాఖ్యలు చేసి కలకలమే రేపారు. శనివారం నందుర్‌బర్ జిల్లాలోని ఓ కార్యక్రమానికి హాజరైన గిరీష్ వ్యాపారస్థులకు ఈ ఉచిత సలహా ఇచ్చారు. ‘మహారాజు(సదరు ఈవెంట్ నిర్వహించిన కంపెనీ) కంటే మహారాణి ఎక్కువ గిరాకీ చేస్తుంది. బాబీ అండ్ జూలీ ఇలా సెక్సీగా పేర్లు పెట్టాలి’’ అంటూ ఆయన ప్రసంగించారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు గిరీష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.
బహుశా ఆయనో పెద్ద తాగుబోతు అయి ఉంటాడని.. అందుకే ఇలా విచక్షణ మరిచి వ్యాఖ్యలు చేశాడంటూ ఎన్‌సీపీ అధికార ప్రతినిధి మాలిక్ చెప్పారు. మరోవైపు శివ సేన కూడా సామ్నా ఎడిటోరియల్ లో మహాజన్‌పై ఘాటు వ్యాసం రాసింది. ఒకానోక దశలో రాజీనామా చేయాలంటూ డిమాండ్ తెరపైకి రావటంతో వెనక్కి తగ్గిన ఆయన క్షమాపణలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment