కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం 218 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ప్రకటించిన జాబితా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలుకుబడికి అద్దంపట్టింది. అధిక సంఖ్యలో తన అనుచరులకు ఆయన టికెట్లు ఇప్పించుకున్నారు. జేడీఎస్, బీజేపీ, ఇతర పార్టీల ఫిరాయించిన పది మందికి టికెట్లిచ్చేలా అధి ష్టానాన్ని ఒప్పించగలిగారు. అయితే రెండు సీట్ల నుంచి ఆయన పోటీకి యత్నించినా.. ఒక్క స్థానం నుంచే పోరుకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నుంచి ఆయన పోటీచేస్తారు.
112 మంది సిట్టింగ్‌లకు అవకాశం
ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 112 మందికి మళ్లీ పోటీచేసే అవకాశం లభించగా, పది మంది సిట్టింగ్‌లకు మాత్రమే కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, మంత్రి డీకే శివకుమార్, పీసీసీ నేత జి.పరమేశ్వర కూడా తమ మద్దతుదారులకు తగినన్ని సీట్లు సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో పది మంది మహిళలకు కాంగ్రెస్ టికెట్లు లభించగా ఈసారి వారికి 15 సీట్లు దక్కాయి. దాదాపు వంద నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని నిర్ణయించే లింగాయత్‌లకు పెద్ద సంఖ్యలో స్థానం కల్పించారు.
కిందటేడాది పంజాబ్ ఎన్నికల్లో అనుసరించిన ‘ఒక కుటుంబానికి ఒక టికెట్’ అనే సూత్రానికి.. కర్ణాటకలో నాలుగు చోట్ల మినహాయింపునిచ్చారు. సిద్దరామయ్య కొడుకు యతీంద్రకు, హోం మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డికి, న్యాయ శాఖ మంత్రి జయచంద్ర కొడుకు సంతోష్‌కు, గృహనిర్మాణ మంత్రి ఎం.కృష్ణప్ప కుమారుడు ప్రియాకృష్ణకు కూడా టికెట్లు ఇచ్చారు. మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, ఐటీ మంత్రి ప్రియాంక్‌కు మళ్లీ చిత్తాపూర్ టికెట్ ఇచ్చారు. ఎంపీ మునియప్ప కుమార్తె రూపా శశిధర్‌కు కోలార్ నుంచి పోటీచేసే అవకాశమిచ్చారు. ఇక యడ్యూరప్ప పోటీచేసే శివమొగ్గ జిల్లా షికారీపురలో కాంగ్రెస్ తరఫున జీబీ మాలతీష్ తలపడతారు.
లింగాయత్‌లకు 40 స్థానాలు
బలమైన సామాజికవర్గం లింగాయత్‌లకు 40, ఒక్కళిగలకు 25, ముస్లింలకు 15 టికెట్లు లభించాయి. బీసీలకు 50, అగ్రకులాలు కొడవ, బంట్, వైశ్యులకు ఐదు, బ్రాహ్మణ వర్గానికి ఐదు టికెట్లు కేటాయించారు. కాంగ్రెస్‌లో చేరిన ఏడుగురు జేడీఎస్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు లభించాయి. బళ్లారి ప్రాంతానికి చెందిన వివాదాస్పద వ్యాపారవేత్తలు ఆనంద్ సింగ్, బి.నాగేంద్రలు చోటు దక్కించుకున్నారు. కోస్తా ప్రాంతంలోని దక్షిణ కన్నడలోని ఏడు స్థానాల్లో బీజేపీ కొత్త వారిని మెహరించగా.. కాంగ్రెస్ మాత్రం సీనియర్లకే అవకాశమిచ్చింది. బెంగళూరులోని సంపన్న ప్రాంతం జయనగర్‌లో హోం మంత్రి కుమార్తె సౌమ్యారెడ్డికి కాంగ్రెస్ టికెట్ లభించగా, బీజేపీ నుంచి బీఎన్ విజయ్‌కుమార్‌కు టికెట్ దక్కింది. బళ్లారి సిటీ నుంచి బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖర్‌రెడ్డిపై మైనింగ్ వ్యాపారి అనిల్ లాడ్‌కు అవకాశమిచ్చారు. బళ్లారి(ఎస్టీ) స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఫకీరప్పతో బి.నాగేంద్ర తలపడతారు.
బీజేపీలో యడ్యూరప్ప హవా
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ టికెట్ల కేటాయింపులో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప హవా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా రెండో జాబితాలో ఆయన విధేయులకే అధిక శాతం టికెట్లు దక్కాయి. బీజేపీ అధిష్టానం మొదట్లో కొద్దిగా తటపటాయించినా చివరకు యడ్యూరప్ప లాబీయింగ్ వైపే మొగ్గుచూపింది. ఇతర అంశాల కంటే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు రెండో జాబితాను బట్టి స్పష్టమవుతోంది. యడ్యూరప్ప విధేయులు కట్టా సుబ్రమణ్య నాయుడు, కృష్ణయ్య శెట్టి, హరతాలు హలప్పకు తాజా జాబితాలో టికెట్లు దక్కాయి.
బళ్లారి సిటీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డికి అవకాశమిచ్చారు. సోమశేఖర రెడ్డిపై గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగంగా అసంతృప్తి వెలిబుచ్చినా చోటు దక్కడం గమనార్హం. గాలి కుటుంబానికి సన్నిహితుడైన సన్న ఫకీరప్పకు కూడా టికెటిచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరిన కుమార బంగారప్ప, ఎన్‌ఎల్ నరేంద్ర బాబు, సందేశ్ స్వామిలకు జాబితాలో స్థానం లభించింది. యడ్యూరప్పపై బహిరంగ విమర్శలు చేసిన వారికి మాత్రం మొండిచేయి చూపారు.
లింగాయత్‌లకు 32: బీజేపీ రెండో జాబితాలో లింగాయత్ వర్గాని కి 32 , ఒక్కళిగ వర్గానికి 10, ఓబీసీలు, ఇతరులకు 20 స్థానాలు కేటాయిం చారు. అయితే మొదటి, రెండో జాబితాలో ఒక్క ముస్లిం, క్రిస్టియన్ అభ్యర్థికీ చోటు దక్కలేదు. దీన్ని బట్టి చూస్తే ఉత్తర ప్రదేశ్‌లో అనుసరించిన వ్యూహాన్నే కర్ణాటకలోను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూపీ లాగానే కర్ణాటకలో గణనీయంగా ముస్లిం జనాభా ఉన్నా ఒక్కరికి కూడా టికెట్ కేటాయించలేదు. గతేడాది అత్యాచార ఆరోపణల ఎదుర్కొన్న మాజీ మంత్రి హరతాలు హలప్పపై వ్యతిరేకత ఉన్నా ఆయన యడ్యూరప్ప విధేయుడు కావడంతో సీటు ఇవ్వక తప్పలేదు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment