సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు ఇచ్చిన హామీ ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని ప్రకటించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగ అవరోధాలు ఉండటంతో 4 శాతం అమలు చేసిందన్నారు. దీనివల్ల 10 లక్షల మంది ముస్లిం విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కేసీఆర్ వాగ్దానం చేశారని ఉత్తమ్ గుర్తుచేశారు. అయితే 40 నెలలు దాటినా ఒక్క ముస్లిం కూడా అదనంగా రిజర్వేషన్ల ప్రయోజనం పొందలేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన ఏబీసీడీ వర్గీకరణను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు.
అలాగే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ దానిని కూడా విస్మరించారని విమర్శించారు. భారత తొలి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ నెల 12న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతూ, చార్మినార్ నుంచి గాంధీభవన్‌దాకా 12 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment