విరాట్ కు బౌలింగ్.. కష్టమేం కాదు
► ఇది బ్యాటింగ్ పిచ్.. కాస్త ఓపిక పట్టాలి
► వెస్టిండీస్ స్పిన్నర్ దేవెంద్ర బిషూ
నార్త్ సౌండ్: బౌలర్లు సహనం కోల్పోతే సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలిస్తుందని వెస్డిండీస్ లెగ్ స్పిన్నర్ దేవెంద్ర బిషూ అన్నాడు. భారత్తో జరుగుతున్న తొలిటెస్టులో మొదటిరోజు టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేయగా, అందులో మూడు వికెట్లు బిషూనే తీశాడు. సహచరుల నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా బిషూ మాత్రం (3/108) పోరాటం చేస్తున్నాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(143 నాటౌట్)కి బౌలింగ్ చేయడం తనకు సవాలు కాదని, ఆట అన్నాక కాస్త ఓపిక అవసరమని వ్యాఖ్యానించాడు. ఇది కచ్చితంగా బ్యాటింగ్ పిచ్ అని స్పిన్నర్ బిషూ పేర్కొన్నాడు. తొలిరోజు బంతి టర్న్ అవ్వలేదని, అయితే మూడోరోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు. గాబ్రియెల్ భారత టాపార్డర్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాడని, అతని నుంచి కాస్త సహకారం లభించిందన్నాడు. తొలిరోజు టీమిండియాదే అయినా, మాకు ఓ రోజు వస్తుంది.. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని బిషూ ధీమా వ్యక్తం చేశాడు.