కోహ్లీ రికార్డులే రికార్డులు..
ఐదేళ్ల క్రితం ఇదే వెస్టిండీస్ పర్యటనతో తన కెరీర్లో ఆరంగేట్రం చేసినప్పుడు.. అతడు ఒకరకంగా చెప్పాలంటే పాలబుగ్గల పసివాడు. అరివీర భయంకరులైన వెస్టిండీస్ బౌలర్లను చూసి భయపడ్డాడు... దాంతో తడబడ్డాడు. కానీ ఇప్పుడు, టీమిండియాను వరుస విజయాల బాటలో నడిపిస్తున్న విజయవంతమైన కెప్టెన్ హోదాలో మళ్లీ అదే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాడు. మొదటి టెస్టు మొట్టమొదటి రోజే అజేయంగా 143 పరుగులు చేసి.. తానేంటో వెస్టిండియన్లకు చూపించాడు. ఇదీ తన అసలైన సత్తా అని రుజువు చేశాడు.
అవును.. విరాట్ కోహ్లీ 2011లో తొలిసారి వెస్టిండీస్ పర్యటనతోనే తన టెస్ట్ కెరీర్ ఆరంభించాడు. మూడు టెస్టుల్లో కలిపి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 19 పరుగులు చేసిన కోహ్లీ, రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కలిపి 27 పరుగులు చేయగా తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. మూడో టెస్టులో ఓ ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేశాడు. ఓవరాల్ గా అక్కడ గతంలో 15.20 సగటుతో నిరాశపరిచాడు.
ఇప్పుడు తాజా సిరీస్లో మొదటి టెస్టు సందర్భంగా తన విశ్వరూపం చూపించాడు. కోహ్లీ అద్భుత శతకం (143 పరుగులు; 197 బంతుల్లో 16 ఫోర్లు) చేసి అజేయంగా నిలవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. టెస్టుల్లో కోహ్లీకిది 12వ శతకం. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. టెస్టుల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శించిన కోహ్లీ 73 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు పూర్తిచేసి వ్యక్తిగత మైలురాయిని చేరుకున్నాడు. ఆంటిగ్వా టెస్టులో వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద మూడువేల పరుగుల మైలురాయి అందుకున్నాడు.
సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ కెప్టెన్గా టెస్టుల్లో 1000 పరుగులు పూర్తిచేసుకోవడం విశేషం. విండీస్ పై శతకాలు సాధించిన టీమిండియా కెప్టెన్లలో మూడోవ్యక్తిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 1982-83లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో కపిల్‌దేవ్ (100) పరుగులు చేయగా, 2006లో గ్రాస్ ఐస్ లెట్ లో రాహుల్ ద్రావిడ్ 146 పరుగులు చేశాడు. మరో 4 పరుగులు జతచేస్తే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ గానూ మరో రికార్డుకు కోహ్లీ చేరువలో ఉన్నాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతకుముందు 2014-15లలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లి అత్యధిక స్కోర్లు నమోదు చేశాడు. మెల్ బోర్న్ టెస్టులో 169 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయగా, సిడ్నీ టెస్టులో 147 పరుగులతో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఇదిలా ఉండగా, కోహ్లి సాధించిన 12 శతకాల్లో 9 సెంచరీలు విదేశాల్లో నమోదు చేయడం మరో విశేషం. ప్రస్తుతం కోహ్లి అజేయంగా ఉండటంతో తన అత్యధిక వ్యక్తిగత స్కోర్లను సవరించే అవకాశం ఉంది.