'బంగ్లాను తక్కువగా అంచనా వేయోద్దు'
న్యూఢిల్లీ: ఎట్టిపరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్ జట్టును తక్కువగా అంచనా వేయరాదని టీమిండియాను జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి హెచ్చరించాడు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ... గెలవడం అలవాటుగా మార్చుకోవాలంటూ ఆసియా కప్ ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు. ఆసియా కప్ లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ ఆతిథ్య బంగ్లా జట్టుతో ఆడనుంది. ఆస్ట్రేలియాపై 3-0తో క్లీన్ స్వీప్, శ్రీలంకపై 2-1తో విజయంతో భారత్ చాలా జోష్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రతిసారీ ఆఖర్లో పోరాటం చేయడమే కాదు ఆరంభం నుంచే దూకుడుగా ఇన్నింగ్ మొదలెట్టాలని ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఎలాంటి పిచ్ లు తయారుచేసిన వెనకంజ వేయరాదని, గెలవాలన్న కసితో క్రికెట్ ఆడటం మీ పని అన్నాడు. కేవలం ప్రత్యర్థి జట్లు మాత్రమే మారతాయంటూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేలా మాట్లాడాడు. పాక్, లంక బలమైన జట్టు అయినప్పటికీ బంగ్లాను తేలికగా తీసిపారేయోద్దు అని చురక అంటించాడు. గత కొన్నేళ్లుగా బంగ్లాను గమనిస్తున్నాను.. బంగ్లా జట్టు చాలా మెరుగైందిని గతంలో ఆ జట్టు చేతిలో వారి దేశంలో 1-2 తేడాతో వన్డే సిరీస్ పరాజయాన్ని ఈ సందర్భంగా టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి గుర్తుచేశాడు.