ఇంగ్లండ్ సరికొత్త రికార్డు!
రాజ్కోట్: భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. 114/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. భారత్ లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అలెస్టర్ కుక్-హసీబ్ హమిద్లు 180 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సాధించి ఓ కొత్త రికార్డును నమోదు చేశారు. ఇది భారత్ లో ఆ జట్టు సాధించిన అత్యుత్తమ టెస్టు ఓపెనింగ్ భాగస్వామ్యంగా రికార్డులెక్కింది. ఇప్పటివరకూ అత్యధిక ఇంగ్లండ్ టెస్టు ఓపెనింగ్ భాగస్వామ్యం గ్రేమ్ ఫావ్లర్-రాబిన్స్ల పేరిట ఉంది. 1985లో చెన్నైలో ఈ జోడి నమోదు చేసిన 178 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యమే ఈ రోజు వరకూ ఇంగ్లండ్ కు భారత్ లో అత్యధికం.
మరొకవైపు ఓవరాల్ గా భారత్ లో ఇది రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యంగా నమోదైంది. గతంలో భారత్ జోడి గౌతం గంభీర్-వీరేంద్ర సెహ్వాగ్లు స్వదేశంలో సాధించిన 182 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం టాప్ లో ఉంది. ఆ అవకాశాన్ని ఇంగ్లండ్ జోడి రెండు పరుగుల తేడాతో కోల్పోయి రెండో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంచితే 194 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో సెంచరీ మార్కును చేరిన కుక్.. భారత్ లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. కుక్ కు ఇది భారత్ లో ఐదో టెస్టు సెంచరీ. ఇంతవరకూ ఏ విదేశీ ఆటగాడు భారత్ లో నాలుగు శతకాలు మించి చేయలేదు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లాలు భారత్ లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాళ్లు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కుక్ 243 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లతో 130 పరుగులు చేశాడు. ఇది టెస్టు కెరీర్ లో 30వ సెంచరీ.