న్యూఢిల్లీ: భారత వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో మళ్లీ కీలకం కానున్నాడు. శుక్రవారం ఢిల్లీ క్రికెట్ సంఘానికి ఎన్నికలు నిర్వహించగా రజత్ శర్మ నేతృత్వంలోని ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కార్యదర్శిగా ఎన్నికైన వినోద్ తిహారా మాట్లాడుతూ.. ఇకపై గంభీర్ డీడీసీఏలో ప్రభుత్వ నామినీగా కీలకంగా ఉంటాడని, క్రికెట్ సంబంధిత నిర్ణయాలన్నింట్లోనూ అతడి పాత్ర ఉంటుందని చెప్పాడు. ‘క్రికెట్ సంబంధిత నిర్ణయాలన్నీ గంభీరే తీసుకుంటాడు. ఢిల్లీ క్రికెట్లో గంభీర్‌ది పెద్ద పేరు. దాంతో డీడీసీఏలో గంభీర్ మేజర్ రోల్ పోషిస్తాడు’ అని తిహారా చెప్పారు.
గతేడాది డీడీసీఏ మేనేజింగ్ కమిటీలో గంభీర్‌ను ప్రభుత్వ నామినీగా నియమించారు. అయితే గంభీర్ ఇంకా క్రికెట్ ఆడుతూ ఉండటంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాల్లో భాగంగా అతనికి కీలక బాధతలు అప్పచెప్పడానికి అర్హత లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిపాలన కమిటీ సభ్యుడు జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా మరొకసారి గంభీర్ పేరును తెరపైకి తేవడాన్ని రజత్ శర్మ ప్యానల్ సమర్ధించుకుంది. మరొకసారి గంభీర్ విషయంలో ఎటువంటి వివాదాలు చెలరేగకుండా ఉండేలా చూసుకుంటామని తిహారా తెలిపారు. ఈ మేరకు తమకు కొన్ని ప్రణాళికలున్నాయని ఆయన స్పష్టం చేశారు. క్రికెట్ విధాన నిర‍్ణయాల్లో గంభీర్ కీలకంగా వ్యవహరిస్తాడన్నారు. ఇందుకు క్రికెట్ అఫైర్స్ పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment