ఉబెర్‌కప్‌లో సెమీస్‌కు చేరతాం | Good chances of India making Uber Cup quarters: Saina Nehwal | Sakshi
Sakshi News home page

ఉబెర్‌కప్‌లో సెమీస్‌కు చేరతాం

Published Thu, May 15 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

Good chances of India making Uber Cup quarters: Saina Nehwal

సైనా నెహ్వాల్ విశ్వాసం
 న్యూఢిల్లీ: సింగిల్స్‌లో తాను రాణిస్తే అది జట్టులోని మిగిలిన వారందరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేర్కొంది. త్వరలో ప్రారంభం కానున్న థామస్, ఉబెర్ కప్ టోర్నీ కోసం ప్రాక్టీస్‌లో పాల్గొంటున్న సందర్భంగా సైనా మాట్లాడింది. మూడు సింగిల్స్, రెండు డబుల్స్ విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో తొలి సింగిల్స్‌లో సైనా, రెండో సింగిల్స్‌లో పి.వి.సింధు ఆడనున్నారు.
 
  అయితే తొలి మ్యాచ్ ప్రభావం ఇతర మ్యాచ్‌లపై తప్పక ఉంటుందని, ఆ మేరకు తాను మరింతగా శ్రమించాల్సి ఉంటుందని సైనా తెలిపింది. ‘నాతోపాటు రెండో సింగిల్స్‌లో సింధు, ఆపై డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి గెలుస్తారు. జట్టుగా మేమంతా కలిసి రాణించగలమన్న విశ్వాసం ఉంది’ అని సైనా వ్యాఖ్యానించింది. ఈ పోటీల్లో భాగంగా ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు.. థాయ్‌లాండ్, కెనడా, హాంకాంగ్ జట్లు ఉన్న గ్రూప్‌లో ఆడనుంది.
 
 అయితే థాయ్‌లాండ్ మినహా మిగిలిన రెండు జట్లపైనా సనాయాసంగానే నెగ్గుతామని, థాయ్‌లాండ్‌పైనా పైచేయి సాధిస్తామని సైనా ధీమా వ్యక్తం చేసింది. ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తాను ఆడకపోయినా మిగతా వాళ్లంతా చక్కగా రాణించారని పేర్కొంది. గాయాల నుంచి కోలుకొని నెల రోజుల నుంచి సాధన చేస్తున్నానని, పూర్తి ఫిట్‌నెస్‌తో టోర్నీ కోసం ఎదురు చూస్తున్నట్లు సైనా చెప్పింది.
 
 సారథులు సైనా, కశ్యప్
 థామస్, ఉబెర్ కప్ టోర్నీల్లో భారత్‌కు పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ సారథ్యం వహించనున్నారు. థామస్ కప్‌లో మలేషియా, దక్షిణ కొరియా, జర్మనీలు గల గ్రూప్‌లో ఆడనున్న భారత పురుషుల జట్టులో కె.శ్రీకాంత్ తొలి సింగిల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. ఉబెర్ కప్‌లో సారథి సైనాయే తొలి సింగిల్స్ ఆడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement