రేపల్లె/విజయవాడ స్పోర్ట్స్: ఒలింపిక్స్ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన తొలి స్విమ్మర్ మెహబూబ్ షంషేర్ ఖాన్ ఆదివారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. 87 ఏళ్ల షంషేర్ ఖాన్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2016 డిసెంబర్‌లో ఆయన భార్య ఫాతిమా మృతి చెందారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం కైతేపల్లి గ్రామానికి చెందిన షంషేర్ ఖాన్ 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ (హీట్స్‌లో ఐదో స్థానం), 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ (హీట్స్‌లో ఆరో స్థానం) ఈవెంట్స్‌లో పాల్గొన్నారు.
1930 ఆగస్టు 2వ తేదీన జన్మించిన షంషేర్ ఖాన్ ఎలాంటి కోచ్‌లు, సదుపాయాలు లేకుండానే కృష్ణానదిలో ఈత నేర్చుకున్నారు. 16 సంవత్సరాల వయస్సులో 1946లో బెంగళూరులోని సదరన్ కమాండ్‌లో ఆర్మీలో చేరారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉండటంతో ఈతలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు. 1954 నుంచి వరుసగా మూడుసార్లు సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచారు.
మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆర్మీలో రకరకాల విధుల కారణంగా స్విమ్మింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. 1962లో ఆయన అసోంకు బదిలీ అయ్యారు. అక్కడ చైనా బోర్డర్ వరకు రోడ్డు వేసే పనిలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. జలంధర్ రెజిమెంట్‌లో శత్రువులు రాకుండా మైన్స్ పెట్టే బలగంలో పనిచేశారు. 1973లో సుబేదార్ హోదాలో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక కొన్నేళ్ల పాటు సికింద్రాబాద్ ఆర్మీ క్యాంటీన్‌లో పనిచేసి స్వగ్రామానికి వచ్చారు.
సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ సంతాపం
షంషేర్ ఖాన్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.బంగారురాజు, ఓఎస్‌డీ ప్రత్తిపాటి రామకృష్ణ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు జరిగే అంతిమ యాత్రలో ‘శాప్’ ప్రతినిధులుగా గుంటూరు డీఎస్‌డీవో, సిబ్బంది, క్రీడాకారులు, పీఈటీలు పాల్గొంటారని శాప్ ఒక ప్రకటనలో పేర్కొంది.
‘సాక్షి’తోనే అందరికీ తెలిశా..
‘ఊరూ పేరూ లేని చోటుకు వెళ్లి గుర్తింపులేని ఆటల్లో పతకాలు గెలిచినవాళ్లకు ప్రభుత్వాలు భారీ నగదు పురస్కారాలు ఇచ్చేస్తున్నాయి. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌లో తొలి భారతీయునిగా షంషేర్‌ఖాన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తే... ఆ తరువాత 1996 వరకు అంటే 40 ఏళ్ల పాటు భారత్ నుంచి ఎవరికీ ఒలింపిక్స్‌లోని స్విమ్మింగ్ ఈవెంట్‌లో పాల్గొనే అర్హత కూడా లభించలేదు. అలాంటి దిగ్గజం 86 ఏళ్ల వయసులో ఎటువంటి గుర్తింపూ లేకుండా నివసిస్తున్నారు, మన ఒలింపియన్‌ను కనీసం గౌరవించుకోలేకపోవడం తెలుగుజాతి దురదృష్టం.
పాతతరం యోధులను గుర్తించి సన్మానిస్తే చాలు...ఆ గుర్తింపే వాళ్లను మరింతకాలం బతికిస్తుంది’ అని 2016 జూలై 20వ తేదీన ‘ఎవరికీ పట్టని ఓ ఒలింపియన్’ పేరుతో సాక్షి పత్రిక స్పోర్ట్స్ పేజీలో కథనాన్ని ప్రచురించి షంషేర్‌ఖాన్‌ను తెలుగుజాతికి పరిచయం చేసింది. దీంతో శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.బంగారురాజు, శాప్ ఓఎస్‌డీ పి.రామకృష్ణ చొరవ తీసుకొని ప్రభుత్వ క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లగా... రూ.25 లక్షల నగదు పారితోషికం, ఇంటి స్థలం మంజూరు చేసి అందజేశారు.
దీంతో ఆయన చివరి దశలో కొద్దిపాటి గుర్తింపు లభించి కాస్తంత సంతృప్తిగా కాలం చేశారని చెప్పవచ్చు. ఈ ఏడాది నరసరావుపేటలో జరిగిన జాతీయ ఖేలో ఇండియా కబడ్డీ పోటీల్లో ఆయన ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షలు చెక్కును అందుకున్నారు. అప్పుడు ఈ విషయాన్ని సాక్షి స్పోర్ట్స్ ప్రతినిధితో ఆయన సంతోషాన్ని పంచుకుంటూ...‘‘నాకు సాక్షి ద్వారా 60 ఏళ్ల తరువాత గుర్తింపు వచ్చింది. అందరికీ తెలిశాను’ అంటూ చెమర్చిన కళ్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment