ఖాట్మండు: దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో భారత్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యాయి. వరుసగా మూడోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత్ ఆశలపై అఫ్ఘానిస్థాన్ నీళ్లుచల్లింది. బుధవారం జరిగిన ఫైనల్లో అఫ్ఘాన్ జట్టు 2-0 గోల్స్ తేడాతో హాట్ ఫేవరెట్ భారత్‌ను కంగుతినిపించింది. తొలిసారి ‘శాఫ్’ ట్రోఫీని సగర్వంగా చేజిక్కించుకుంది. రెండేళ్ల క్రితం భారత్ చేతిలో తమకెదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకుంది. అఫ్ఘానిస్థాన్ జట్టుకు ముస్తఫా అజద్జొయ్ (8వ నిమిషంలో), సంజార్ అహ్మది (63వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. అంతిమ పోరులో భారత ఆటగాళ్లు విఫలమయ్యారు. ప్రత్యర్థుల అటాకింగ్‌ను నిలువరించేందుకు ఆపసోపాలు పడ్డారు.
ఆట ఆరంభం నుంచి అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా కదంతొక్కారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో అఫ్ఘాన్ రక్షణ శ్రేణి అద్భుతంగా కదిలింది. భారత అటాకింగ్‌కు ఎక్కడిక్కడ ముకుతాడు వేయడంతో చిరస్మరణీయ ఫలితాన్ని సాధించింది. కోచ్ విమ్ కొయెవర్మన్ అనాలోచిత నిర్ణయంతో భారత రెగ్యులర్ కెప్టెన్ సునీల్ చెత్రి చాలా ఆలస్యంగా బరిలోకి దిగాల్సివచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో చేసేదేమీలేకపోయింది.
భారత్‌కు చుక్కెదురు
Published Thu, Sep 12 2013 12:40 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement