పంజాబ్ బల్లే..బల్లే...
కోల్‌కతాపై 23 పరుగులతో గెలుపు
వరుసగా నాలుగో విజయం
రాణించిన సందీప్, అక్షర్ పటేల్
మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించలేదు. డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించలేదు. చివరికి భారీ స్కోరు కూడా నమోదు కాలేదు. అయినా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి, సగర్వంగా గెలిచి వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది.
అబుదాబి: ఐపీఎల్-7లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. తొలుత వీరేంద్ర సెహ్వాగ్ (30 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌తో రాణించగా... సందీప్ శర్మ (3/21), అక్షర్ పటేల్(2/16), మిచెల్ జాన్సన్ (2/22) అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ముకుతాడు వేశారు. ఫలితంగా పంజాబ్ 23 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. శనివారం షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
రిషి ధావన్ (18 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా స్పిన్నర్లు పీయూష్ చావ్లా, సునీల్ నరైన్ చెరో మూడు వికెట్లు తీసుకుని పంజాబ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత కోల్‌కతా 18.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మూడు వికెట్లు తీసిన పంజాబ్ పేసర్ సందీప్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
నరైన్, చావ్లా మ్యాజిక్
తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ రెండో ఓవర్‌లోనే పుజారా వికెట్‌ను చేజార్చుకుంది. ఆరంభంలోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సాహా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తక్కువ స్కోరుకే కలిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సెహ్వాగ్, మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడటంతో పంజాబ్ జట్టు పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.
ఏడో సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ అభిమానులను నిరాశపరుస్తూ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర మోర్కెల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇక వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరుమీదున్నట్లు కనిపించిన మిల్లర్‌ను చావ్లా అవుట్ చేశాడు. ఆ తర్వాత అదే మ్యాజిక్‌ను కొనసాగిస్తూ కెప్టెన్ జార్జ్ బెయిలీని, ఓపెనర్ సెహ్వాగ్‌ను డగౌట్‌కి పంపాడు. సెహ్వాగ్ 37 పరుగులతో రాణించాడు.
మిస్టరీ స్పిన్నర్ నరైన్ తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో అక్షర్ పటేల్, మిచెల్ జాన్సన్‌లను అవుట్ చేశాడు. నాలుగో బంతికి బాలాజీని వెనక్కి పంపాడు. చివరికి పంజాబ్ స్కోరు 130 దాటింది.
చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్
లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కోల్‌కతాకు సందీప్ శర్మ ఆరంభంలోనే షాకిచ్చాడు. వరుస ఓవర్లలో మనీష్ పాండే, గౌతమ్ గంభీర్‌లను అవుట్ చేశాడు. కెప్టెన్ గంభీర్ వన్‌డౌన్‌లో బరిలోకి దిగినప్పటికీ ఫామ్‌లోకి రాలేకపోయాడు. సున్నా దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గౌతీ ఒక పరుగుకే వెనుదిరిగాడు. కలిస్‌ను బాలాజీ అవుట్ చేయడంతో కోల్‌కతా 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా పవర్ ప్లేలో 24 పరుగులు మాత్రమే సాధించింది.
ఆ తర్వాత బౌలర్లు అదే జోరు కొనసాగించారు. దీంతో 12 పరుగుల తేడాతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ క్రిస్ లిన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్ చివర్లో మెరుపులు మెరిపించినా... లక్ష్యాన్ని చేధించలేకపోయింది.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: పుజారా రనౌట్ 8; సెహ్వాగ్ (బి) చావ్లా 37; సాహా ఎల్బీడబ్ల్యూ (సి) కలిస్ 14; మ్యాక్స్‌వెల్ (బి) మోర్నీ మోర్కెల్ 15; మిల్లర్ (సి) మోర్నీ మోర్కెల్ (బి) చావ్లా 14; బెయిలీ (సి) మోర్నీ మోర్కెల్ (బి) చావ్లా 11; రిషి ధావన్ నాటౌట్ 19; అక్షర్ పటేల్ (స్టంప్డ్) ఉతప్ప (బి) నరైన్ 7; మిచెల్ జాన్సన్ (బి) నరైన్ 0; బాలాజీ ఎల్బీడబ్ల్యూ (బి) నరైన్ 0; సందీప్ శర్మ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు): 132
వికెట్ల పతనం: 1-9; 2-28; 3-58; 4-74; 5-101; 6-103; 7-126; 8-126; 9-126.
బౌలింగ్: ఉమేశ్ 4-0-28-0; మోర్నీ మోర్కెల్ 4-0-26-1; కలిస్ 4-0-32-1; నరైన్ 4-0-24-3; పీయూష్ చావ్లా 4-0-19-3.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మనీష్ పాండే ఎల్బీడబ్ల్యూ (బి) సందీప్ శర్మ 8; కలిస్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) బాలాజీ 9; గంభీర్ (సి) పటేల్ (బి) సందీప్ శర్మ 1; క్రిస్ లిన్ (బి) అక్షర్ పటేల్ 13; ఉతప్ప రనౌట్ 19; యూసుఫ్ పఠాన్ ఎల్బీడబ్ల్యూ (బి) రిషి ధావన్ 3; సూర్య కుమార్ (సి) జాన్సన్ (బి) సందీప్ శర్మ 34; పీయూష్ చావ్లా (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ పటేల్ 0; నరైన్ (బి) జాన్సన్ 6; ఉమేశ్ (బి) జాన్సన్ 2; మోర్నీ మోర్కెల్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 109
వికెట్ల పతనం: 1-13; 2-19; 3-19; 4-50; 5-59; 6-62; 7-65; 8-85; 9-103; 10-109.
బౌలింగ్: సందీప్ 4-1-21-3; జాన్సన్ 3.2-0-22-2; బాలాజీ 3-0-21-1; రిషి ధావన్ 4-0-24-1; అక్షర్ 4-0-16-2.