‘7’ పై ఎలెవన్ గురి! | IPL 7 Final: Gautam Gambhir, George Bailey focus on positives ahead of final | Sakshi
Sakshi News home page

‘7’ పై ఎలెవన్ గురి!

Published Sun, Jun 1 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

‘7’ పై ఎలెవన్ గురి!

‘7’ పై ఎలెవన్ గురి!

రాత్రి గం. 8.00 నుంచి
 సోనీ సిక్స్‌లో  ప్రత్యక్ష ప్రసారం
 
 తొలి టైటిల్‌పై కన్నేసిన కింగ్స్
  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ పోరు
  నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
  అద్భుత ఫామ్‌లో ఇరు జట్లు
 
 ఐపీఎల్-7లో నమ్మశక్యం కాని విజయాలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దూసుకొచ్చింది. అదే జోరులో తొలి టైటిల్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే అలాంటి సూపర్ ఫామ్‌లోనూ ఆ జట్టును కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ ఒక్కటే కట్టడి చేయగలిగింది. టోర్నీలో
 ఏకంగా ఏడు సార్లు 190కి పైగా స్కోర్లు చేయగలిగిన పంజాబ్, కోల్‌కతాతో మాత్రం
 ఒక్కసారి కూడా 150 దాటలేకపోయింది.
 
  ఇప్పుడు ఇదే స్ఫూర్తితో, వ్యూహంతో తుదిపోరులో కూడా  వారిని లువరించేందుకునైట్‌రైడర్స్ సిద్ధమైంది. అయితే ఒకరు కాదంటే మరొకరు అన్నట్లుగా బలమైన బ్యాటింగ్ వనరులతో పంజాబ్ కూడా తగ్గనంటోంది. ఇరు జట్ల మధ్య గత మూడు మ్యాచ్‌లు పెద్దగా వినోదాన్ని  పంచలేదు. అలా కాకుండా ‘చిన్న’ మైదానంలో పరుగుల వరద పారాలని అభిమానులు కోరుకుంటున్నారు.
 
 బెంగళూరు: చిరస్మరణీయ ప్రదర్శనలు... మెరుపు ఫీల్డింగ్... వ్యక్తిగత రికార్డులు... ఇలా ఎంతో వినోదం, విశేషాలతో గత 46 రోజులుగా ఆకట్టుకున్న ఐపీఎల్-7 ఇప్పుడు తుది ఘట్టానికి చేరింది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పటిష్టమైన బ్యాటింగ్ పంజాబ్ బలం కాగా... కోల్‌కతా తమ బౌలింగ్‌నే ఎక్కువగా నమ్ముకుంది.
 
  లీగ్ దశలో ఇద్దరూ చెరో మ్యాచ్ నెగ్గినా... తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతానే విజయం వరించింది. అయితే ఇప్పుడు తటస్థ వేదికపై గంభీర్ సేనకు విజయం అంత సులువు కాకపోవచ్చు. టీమ్‌లో ఓవరాల్ ప్రదర్శనను చూస్తే ఆరంభం నుంచి జోరుగా ఆడుతూ కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరగా... ఎనిమిది వరుస విజయాలతో కోల్‌కతా సత్తా ఏమిటో బయటపడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆసక్తికర ముగింపునకు రంగం సిద్ధమైంది.
 బ్యాటింగే బలం...
 
 టోర్నీ మొదట్లో మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్‌ల సూపర్ బ్యాటింగ్ పంజాబ్‌ను గెలిపించింది. ఇప్పుడు సెహ్వాగ్ ఫామ్‌తో ఆ జట్టు బలం రెండింతలైంది. చెన్నైతో శుక్రవారం ఇన్నింగ్స్‌ను బట్టి చూస్తే ఇప్పుడు వీరూ కోసం కూడా ప్రత్యర్థి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందే.
 
 
 మనన్ వోహ్రా కూడా నిలకడగా రాణిస్తూ తనపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. అయితే టోర్నీలో తనదైన ముద్ర వేసినా... గత కొన్ని మ్యాచ్‌లుగా విఫలమవుతున్న మ్యాక్స్‌వెల్, ఆఖరిసారి మెరుపులు ప్రదర్శించాల్సి ఉంది. చివర్లో బెయిలీ, సాహా ధాటిగా ఆడగల సమర్థులు.  మిచెల్ జాన్సన్, సందీప్ శర్మలతో పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. టోర్నీలో ఆ జట్టు పేసర్లు 23.45 సగటుతో 69 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచారు. గత మ్యాచ్ ఆడిన జట్టులో మార్పులు చేస్తే అవానా స్థానంలో రిషి ధావన్‌కు చోటు దక్కవచ్చు.
 
 టోర్నీలో 6.19 ఎకానమీతో 17 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడుతున్నాడు. బౌలర్లంతా విఫలమైన గత మ్యాచ్‌లో అతనొక్కడే చెన్నైని కట్టడి చేసి మ్యాచ్‌ను పంజాబ్ నియంత్రణలోకి  తెచ్చాడు. మరో స్పిన్నర్ కరణ్‌వీర్ సింగ్ కూడా కీలకం కానున్నాడు.
 
 కోల్‌కతాతో మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్ పేలవంగా ఆడింది. పైగా ఐపీఎల్‌లో తొలిసారి ఆ జట్టు ఫైనల్లో ఆడుతుండటంతో జట్టుపై ఒత్తిడి ఉంటుంది. జాన్సన్‌కు గత ఏడాది ముంబై తరఫున ఫైనల్ ఆడిన అనుభవం ఉంది.
 
 ఉతప్పకు అండగా...
 కోల్‌కతా జట్టు బ్యాటింగ్‌కు పెద్ద దిక్కుగా రాబిన్ ఉతప్ప ఉన్నాడు. వరుసగా గత 10 మ్యాచుల్లో అతను 40కి పైగా స్కోర్లు చేయడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. అయితే ఉతప్ప ఇచ్చిన శుభారంభంపైనే ఆధారపడుతున్న జట్టు అతను విఫలమైతే ఇబ్బంది పడే అవకాశం ఉంది.
 
 వరుసగా మూడు ఫిఫ్టీలు కొట్టిన అనంతరం గౌతమ్ గంభీర్ గతి తప్పగా... మనీశ్ పాండే అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. ఆ తర్వాత షకీబ్, యూసుఫ్ పఠాన్‌లపై బ్యాటింగ్ బాధ్యత ఉంది. ఇప్పటివరకు  తన గుర్తింపునకు తగిన న్యాయం చేయలేకపోయిన డస్కటే కీలక ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.
 
  బౌలింగ్‌లో కోల్‌కతా స్పిన్‌దే ఆధిక్యం. ఈ టోర్నీలో 19.91 సగటుతో 43 వికెట్లు తీసిన స్పిన్నర్లు ముందంజలో ఉన్నారు. షకీబ్, చావ్లాలు కీలకం కాగా... పేస్‌లో ఉమేశ్ ఫామ్‌లో ఉండగా, మోర్కెల్ అండగా నిలిచాడు.
  కోల్‌కతా అవకాశాలు నరైన్ వేసే 4 ఓవర్లపై ఆధారపడి ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఫైనల్ కోసం అతను సొంత బోర్డునే ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా రాణించాల్సిన ఒత్తిడి అతనిపై ఉంది. పంజాబ్‌తో తొలి మ్యాచ్‌లో రాణించినా (3/24)... ఆ తర్వాత రెండు మ్యాచుల్లో అతను 8 ఓవర్లలో ఒకే వికెట్ తీసి 60 పరుగులిచ్చాడు.
 
 గతంలో ఐపీఎల్‌లో నెగ్గిన ఆటగాళ్లలో చాలా మంది ఈ ఫైనల్ ఆడుతుండటంతో మానసికంగా నైట్‌రైడర్స్‌దే పైచేయి. ఈ సీజన్‌లో ఒకేసారి 170కు పైగా పరుగులు చేసిన కోల్‌కతా, పంజాబ్‌తో పోలిస్తే ఎప్పుడూ పెద్ద లక్ష్యాలు ఛేదించాల్సిన అవసరం రాలేదు. ప్రత్యర్థి భారీ స్కోరు చేస్తే ఇది సమస్య కావచ్చు.
 
  జట్ల వివరాలు (అంచనా)
 కింగ్స్ ఎలెవన్ పంజాబ్: బెయిలీ (కెప్టెన్), సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్‌వెల్, మిల్లర్, సాహా, జాన్సన్, అక్షర్, సందీప్, కరణ్ వీర్, అవానా/రిషి ధావన్.
 
 కోల్‌కతా నైట్‌రైడర్స్: గంభీర్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, మనీశ్ పాండే, షకీబ్, యూసుఫ్ పఠాన్, డస్కటే, సూర్యకుమార్, చావ్లా, నరైన్, మోర్కెల్, ఉమేశ్ యాదవ్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement