ఒకే ఒక్కడు కుల్దీప్‌ యాదవ్‌ | Kuldeep Becomes First Indian Bowler to Claim Two Hat Tricks | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు కుల్దీప్‌ యాదవ్‌

Published Wed, Dec 18 2019 8:47 PM | Last Updated on Wed, Dec 18 2019 8:50 PM

Kuldeep Becomes First Indian Bowler to Claim Two Hat Tricks - Sakshi

విశాఖ: టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఒక రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో హ్యాట్రిక్‌ సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన తొలి భారత బౌలర్‌గా నయా రికార్డును లిఖించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా 33 ఓవర్‌ను అందుకున్న కుల్దీప్‌ విండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఒక్కసారిగా కకావికలం చేశాడు. ఆ ఓవర్‌లో షాయ్‌ హోప్‌(78) ఆరో వికెట్‌గా ఔట్‌ కాగా, జాసన్‌ హెల్డర్‌(11)కూడా వెంటనే ఔటయ్యాడు. అటు  వెంటనే జోసెఫ్‌(0)సైతం గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. ఆ ఓవర్‌ నాల్గో బంతికి హోప్‌ను ఔట్‌ చేయగా, మరుసటి బంతికి హోల్డర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆపై వెంటనే జోసెఫ్‌ను డకౌట్‌ చేసి హ్యాట్రిక్‌ను సాధించాడు. 2017లో కోల్‌కతాలో ఆసీస్‌తో జరిగిన వన్డేలో కుల్దీప్‌ హ్యాట్రిక్‌ సాధించగా, మరొకసారి హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

భారత్‌ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించిన వారిలో చేతన్‌ శర్మ(1987లో న్యూజిలాండ్‌పై), కపిల్‌ దేవ్‌(1991లో శ్రీలంకపై), మహ్మద్‌ షమీ(2019లో అఫ్గానిస్తాన్‌పై)లు ఉన్నారు. వీరంతా ఒకేసారి హ్యాట్రిక్‌లు సాధిస్తే, కుల్దీప్‌ యాదవ్‌ మాత్రం రెండుసార్లు హ్యాట్రిక్‌లు సాధించడం విశేషం. ఇలా ఒకటికంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో మలింగా(3సార్లు) తొలి స్థానంలో ఉండగా,  రెండు సందర్భాల్లో హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో వసీం అక్రమ్‌, సక్లయిన్‌ ముస్తాక్‌, చమిందా వాస్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కుల్దీప్‌ యాదవ్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. విండీస్‌తో రెండో వన్డేలో  మహ్మద్‌ షమీకి హ్యాట్రిక్‌ తీసే అవకాశం మిస్‌ అయ్యింది. 30 ఓవర్‌ రెండో బంతికి పూరన్‌ను ఔట్‌ చేసిన షమీ.. ఆ ఓవర్‌ మూడో బంతికి పొలార్డ్‌ను గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హోల్డర్‌ దాన్ని అడ్డుకున్నాడు. కాగా, కుల్దీప్‌ తీసిన హ్యాట్రిక్‌లో హోల్డర్‌ భాగం కావడం ఇక్కడ గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement