ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ట్వంటీ20 మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,720 మంది పోలీసులను ఇందుకు వినియోగించనున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ గురువారం మీడియాకు తెలిపారు. భారీ భద్రతతో పాటు 56 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిని పర్యవేక్షించేందుకు జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మ్యాచ్ పూర్తయ్యే వరకు ఎనిమిది బందోబస్తు బృందాలు స్టేడియంలో తిరుగుతూ అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచుతాయి. ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ బృందాలు కూడా పనిచేస్తాయన్నారు.
గొడుగులు తెచ్చుకోవచ్చు...
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను సాయంత్రం నాలుగు నుంచి అనుమతించనున్నారు. గొడుగులు పట్టుకొని మ్యాచ్‌కు వచ్చే అవకాశం కల్పించారు. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మ్యాచ్‌బాక్స్‌లు, బ్యాటరీలు, బ్యాగ్‌లు, బ్యానర్లు, సిగరెట్లు, లైటర్లు, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారాలు, వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, రైటింగ్ పెన్స్ అనుమతించరు.
పార్కింగ్ ప్రాంతాలివే...
స్టేడియం పరిసరాల్లో 9150 వాహనాలకు పార్కింగ్ వసతి కల్పిస్తున్నారు. రామాంతపూర్ నుంచి వచ్చే గేట్ 1– 2కు చెందిన కారు పాస్ హోల్డర్లు స్టేడియంలోని ఏ, బీ పార్కింగ్‌లో వాహనాలు పార్క్ చేయాలి. అక్కడ వాహనాలు ఎక్కువైతే గేట్ 1 ద్వారా గేట్ 11కు చేరుకొని ప్రైవేట్ ఓపెన్ ల్యాండ్‌లో పార్క్ చేయాలి. గేట్ 1– 2కు చెందిన ద్విచక్ర వాహనదారులు పార్కింగ్ బీలో నిలపాలి. కార్పొరేట్ బాక్స్‌ల్లో కంప్లిమెంటరీ పాస్ కలిగిన రామాంతపూర్ మీదుగా వచ్చే కారు పాస్ హోల్డర్స్ తమ వాహనాలను అవుటర్ గేట్–1 ద్వారా పార్కింగ్ ఏ, బీ ప్రాంతాల్లో నిలపవచ్చు.
దివ్యాంగులు రామాంతపూర్ నుంచి రావాలని, వారి వాహనాలను అవుటర్ గేట్ 3 ద్వారా పార్కింగ్ ప్లేస్ బీలో నిలపాలని తెలిపారు. గేట్ నంబర్ 3, 4, 5, 6, 7లకు చెందిన పాస్ కలిగిన ప్రేక్షకులు కారులో వస్తే ఏక్‌మినార్ వైపు నుంచి వచ్చి ఏపీఐఐసీ గ్రౌండ్‌లో నిలపాలి. గేట్ నంబర్ 3, 4, 5, 6, 7లకు చెందిన పాస్ కలిగిన ప్రేక్షకులు ద్విచక్రవాహనాలను ఉప్పల్, హబ్సిగూడ మెయిన్ రోడ్డుపై నిలపాలి. గేట్ నంబర్ 8,9,10,11కు చెందిన వాహనాల పాస్‌లు కలిగిన ప్రేక్షకులు రామాంతపూర్ ఉప్పల్, రామాంతపూర్ మెయిన్‌రోడ్డుపై నిలపాలి. జెన్‌పాక్ట్, వెలుగుగుట్ట గుడి రోడ్డులో గేట్ నంబర్ 7, 8,9,11 పాస్‌లు కలిగిన ప్రేక్షకులు ద్విచక్ర వాహనాలను నిలుపుకోవచ్చునని సీపీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment