సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: సిటీకి భారత్, ఆస్ట్రేలియా ట్వంటీ20 క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. రాంచీలో జరిగిన తొలి ట్వంటీ20లో భారత్ నెగ్గితే...గౌహతిలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయబావుటా ఎగురవేయడంతో సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో ట్వంటీ20 మ్యాచ్‌కు వేదికైన నగరంలో క్రికెట్ అభిమానుల సందడి తారాస్థాయికి చేరింది. 60వేల సామర్థ్యం కలిగిన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో భారత్, కంగారూల మ్యాచ్ వీక్షించేందుకు ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జోరుగా సాగాయి.తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.
ఒకవైపు నగరాన్ని వరుణుడు వెంటాడుతుండటంతో సిరీస్ ఫలితాన్ని తేల్చే ట్వంటీ20 మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. చాలా ఏళ్ల తర్వాత నగరం వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ట్వంటీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో లక్షల్లో బెట్టింగ్‌లు జరిగే అవకాశముందని తెలుస్తోంది.
ప్రత్యేక స్క్రీన్‌ల హడావిడి
అసలే వీకెండ్ రోజులు... పైగా క్రికెట్... ఆపై సాయంత్రం ఇక నగరంలో క్రీడలు, ఫుడ్, డ్రింక్స్‌తో కలిపి ఎంజాయ్ చేసేవారికి అంతకన్నా కిక్ ఏముంటుంది? నగరంలో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ క్రికెట్ పబ్స్, క్లబ్స్, కాఫీషాప్స్ అని తేడా లేకుండా ప్రతి చోటా స్పెషల్ స్క్రీన్స్ ఏర్పాటుకు ‘తెర’ లేపింది. ‘‘మా అవుట్ స్వింగర్ పబ్ పూర్తిగా స్పోర్ట్స్ థీమ్ కావడంతో ప్రతి క్రికెట్ మ్యాచ్ మాకు ఇంపార్టెంట్. అందులో ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ అంటే చాలా పెద్ద ఈవెంట్. అందుకే స్పెషల్ డిజెతో పాటు పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశాం. డ్రింక్స్‌పై ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తున్నాం. మ్యాచ్ అయిపోయినా మరో గంట పాటు పార్టీ కొనసాగుతుంద’’ ని తెలిపారు అవుట్ స్వింగర్ పబ్‌కు చెందిన అమేయ్. ఇదే తరహాలో పలు హోటల్స్ సైతం స్పెషల్ ఆఫర్స్‌తో సిటీ యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment