మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 240 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. 211/5 వద్ద రిజర్వ్ డే(బుధవారం)నాడు తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్ మరో 28 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పరుగులు చేయడానికి శ్రమించింది. ఆ క్రమంలోనే మూడు వికెట్లను వరుసగా చేజార్చుకుంది. దాంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.
ఈ రోజు కివీస్ బ్యాటింగ్‌లో భాగంగా రాస్ టేలర్(74) రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో కివీస్ 225 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను నష్టపోయింది. జడేజా అద్భుతమైన త్రో విసిరి టేలర్‌ను రనౌట్ చేశాడు. ఆపై వెంటనే టామ్ లాథమ్(10) కూడా ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 49 ఓవర్‌లో జడేజా చక్కటి క్యాచ్ అందుకోవడంతో లాథమ్ ఇన్నింగ్స్ ముగిసింది. భువీ వేసిన అదే ఓవర్ చివరి బంతికి మ్యాట్ హెన్రీ(1) కూడా ఔటయ్యాడు. ఇక బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో కివీస్ ఏడు పరుగులే చేసింది. భారత బౌలర్లలో భువీ మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దక్ పాండ్యా, రవీంద్ర జడేజా, చహల్‌లు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment