పాక్‌కు భారీ ఆధిక్యం
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
అబుదాబి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. లెఫ్టార్మ్ పేసర్ రాహత్ అలీ (4/22), స్పిన్నర్ జుల్ఫికర్ బాబర్ (3/79) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్ విలవిల్లాడింది. ఫలితంగా మూడో రోజు మంగళవారం తమ తొలి ఇన్నింగ్స్‌ను 87.3 ఓవర్లలో 262 పరుగులకు ముగించింది. దీంతో పాక్‌కు 304 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఓపెనర్ టామ్ లాథమ్ (222 బంతుల్లో 103; 13 ఫోర్లు) ఒంటరి పోరాటంతో సెంచరీ చేయగా... అండర్సన్ (70 బంతుల్లో 48; 8 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. 47 పరుగుల వ్యవధిలోనే కివీస్ చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. అయితే ఆ తర్వాత పాక్ ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి పాక్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ఇప్పటికి పాక్‌కు మొత్తం 319 పరుగుల ఆధిక్యం ఉంది. రెండో రోజుల ఆట మిగిలి ఉంది.