ఆక్లాండ్: టాస్, పత్యర్థి, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతీ మ్యాచ్ గెలవాలనే కసితో ప్రస్తుత టీమిండియా ఉందని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఎన్నో అపూర్వ విజయాలను అందుకున్నామని, అయితే ప్రపంచకప్ గెలవాలనే కోరిక కోహ్లి సేనకు అలాగే ఉండిపోయిందన్నారు. అయితే ఆ కోరికను కూడా కోహ్లి సారథ్యంలోని టీమిండియా నెరవేర్చుకోబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రవిశాస్త్రి పై వ్యాఖ్యలు చేశాడు. పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటన, ప్రపంచకప్ సన్నద్దత, టీమిండియా గురించి రవిశాస్త్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘మా సమీకరణాల్లో టాస్ అంశాన్ని తీసేశాం. అన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్యత్యర్థి బలాబలాలతో సంబంధ లేకుండా బాగా ఆడాలనుకున్నాం. కేవలం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి విజయాలు, రికార్డులను నమోదు చేయాలనుకున్నాం. ఇప్పటివరకు మేం అనుకున్నవి చేశాం. ఇకముందు కూడా చేస్తాం. ప్రస్తుతం వరల్డ్‌కప్ ఒక్కటి మిగిలిపోయింది. అది కూడా త్వరలో నెరవేరబోతోంది. ఇక చాయిస్‌లు ఎక్కువగా ఉండటం టీమిండియాకు ఎంతో లాభం చేకూరుతుంది. ఆటగాళ్ల మధ్య పోటీ ఎంత ఎక్కువ ఉంటే ఆంత ఎక్కువగా వారి నుంచి ఆట బయటపడుతుంది. ప్రస్తుత ఆటగాళ్లు ఏ పాత్ర పోషించడానికైనా సిద్దంగా ఉన్నారు. ఉదాహరణకు కేఎల్ రాహుల్ జట్టుకోసం దేనికైనా రెడీగా ఉన్నాడు. కీపింగ్ చేస్తున్నాడు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావడానికైనా సిద్దంగా ఉన్నాడు. ఇవన్నీ భారత్‌కు ఎంతో శుభపరిణామం.
టీమిండియా డిక్షనరీలో ‘నేను’ అనే పదం ఉండదు. ‘మేము, మనం’ అనే పదాలు మాత్రమే ఉంటాయి. గెలుపు ఏ ఒక్కరితోనో రాదు.. ఓటమికి ఏ ఒక్కరో కారణం కాదు. ప్రతీ విజయంలో జట్టు సభ్యులందరూ తమ పాత్రను పోషిస్తున్నారు. అందుకే టీమిండియా విజయాన్ని ఏ ఒక్కరికో కట్టబెట్టడం సబబు కాదు. ఇక గతంలో ఆస్ట్రేలియా సిరీస్ గెలిచాక బలహీన జట్టుపై గెలిచారన్నారు. తాజాగా వార్నర్, స్మిత్, లబుషేన్, స్టార్క్, కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఆసీస్ బలంగా ఉంది. అంతేకాకుండా ముంబై వన్డేలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ తిరిగి పుంజుకుని మిగతా రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నాం. మరి ఇప్పుడేమంటారు.
ఇక ఆటగాళ్ల గురించి చెప్పాలంటే.. ముఖ్యంగా సారథి విరాట్ కోహ్లి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా భయపడడు. ఆటపట్ల నిబద్దత, ఇష్టం గల క్రికెటర్. ప్రతీ మ్యాచ్ గెలవాలనే తపన ఉంటుంది. ఇక ఆటగాళ్ల గాయాలు కలవరానికి గురిచేస్తోంది. శిఖర్ ధావన్ లాంటి సీనియర్ ఆటగాడు, మ్యాచ్ విన్నర్ పదేపదే గాయపడటం బాధాకరం. అయితే బ్యాకప్‌లో నాణ్యమైన ఆటగాళ్లు ఉండటంతో టీమిండియాపై అంతగా ప్రభావం చూపదు. కేదార్ జాదవ్ నాణ్యమైన ఆటగాడు. జట్టుకు అవసరమైనప్పుడు బంతితో కూడా రాణించగలడు. న్యూజిలాండ్ పర్యటనలో అతడు కీలకం కావచ్చు. ఇక కొంతమంది ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని నన్ను ప్రశ్నిస్తున్నారు. వారందరికీ నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. నేను సెలక్టర్‌ను కాదు కోచ్‌ను’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి:
ఇక కీపర్‌గా కేఎల్ రాహుల్: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment