ఆస్ట్రేలియా వల్లే కాలేదు, న్యూజిలాండ్ ఇక్కడికి వచ్చింది ఓడిపోయేందుకే... వన్డే సిరీస్ ఆరంభానికి ముందు చాలా ఎక్కువగా వినిపించిన మాట ఇది. అయితే కంగారూలు చేయలేని పనిని కివీలు చేసి భారత్‌కు సొంతగడ్డపై షాక్ ఇచ్చారు. పటిష్టమైన టీమిండియాను తొలి మ్యాచ్‌లోనే చిత్తు చేసి విలియమ్సన్ సేన కొత్త సవాల్ విసిరింది. పేసర్లు తేలిపోయారు, స్పిన్నర్లు చేతులెత్తేశారు... ఫలితంగా వాంఖెడే మైదానంలో కోహ్లి బృందం అలవోకగా తలవంచింది.
ఓపెనర్లు విఫలమైనా, ఇతర బ్యాట్స్‌మెన్ కనీసం అర్ధ సెంచరీ సాధించకున్నా... కోహ్లి మరో అద్భుత సెంచరీ ముందుగా భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించింది. భారత గడ్డపై పేలవ రికార్డు ఉన్న న్యూజిలాండ్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మన చేతికి చిక్కినట్లే అనిపించింది. అయితే నాలుగో వికెట్‌కు లాథమ్, రాస్ టేలర్ 200 పరుగుల భాగస్వామ్యం కివీస్‌ను గెలిపించింది. కెప్టెన్ కోహ్లికి కెరీర్‌లో 200వ వన్డే మాత్రం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ముంబై: వన్డేల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న భారత్‌ను న్యూజిలాండ్ నిలువరించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో కివీస్ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (125 బంతుల్లో 121; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 31వ సెంచరీతో చెలరేగగా... ట్రెంట్ బౌల్ట్ (4/35) భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 49 ఓవర్లలో 4 వికెట్లకు 284 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (102 బంతుల్లో 103 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా, రాస్ టేలర్ (100 బంతుల్లో 95; 8 ఫోర్లు) కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు. తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ బుధవారం పుణేలో జరుగుతుంది.
కీలక భాగస్వామ్యాలు...
తన రెండో ఓవర్లోనే ధావన్ (9)ను, ఆ తర్వాత రోహిత్ (20)ను అవుట్ చేసిన బౌల్ట్ కివీస్‌కు శుభారంభం అందించాడు. ఈ దశలో కోహ్లి నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా... నాలుగో స్థానంలో అవకాశం దక్కించుకున్న కేదార్ జాదవ్ (12) దానిని వృథా చేసుకున్నాడు. ఈ దశలో కోహ్లికి కార్తీక్ (47 బంతుల్లో 37; 4 ఫోర్లు) సహకారం అందించాడు. నాలుగో వికెట్‌కు 73 పరుగుల కీలక భాగస్వామ్యం తర్వాత కార్తీక్ వెనుదిరిగాడు. అనంతరం ధోని (42 బంతుల్లో 25; 2 ఫోర్లు) కూడా కోహ్లికి అండగా నిలిచాడు. కోహ్లి, ధోని ఐదో వికెట్‌కు 57 పరుగులు జత చేసిన అనంతరం బౌల్ట్ ఈ జోడీని విడదీశాడు. మరోవైపు కోహ్లి మరింత బాధ్యతగా ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఆ ఇద్దరూ కలిసి...
వన్డేల్లో ఇటీవలి కాలంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రా ఆరంభంలో పడగొడుతున్న వికెట్లే భారత్ విజయాన్ని శాసిస్తున్నాయి. అయితే కివీస్ ఓపెనర్లు గప్టిల్ (32; 5 ఫోర్లు), మున్రో (28; 3 ఫోర్లు, 1 సిక్స్) వీరిద్దరిని సమర్థంగా ఎదుర్కొన్నారు. చక్కటి సమన్వయంతో ఆడుతూ తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అనంతరం కార్తీక్ ఆకట్టుకునే క్యాచ్‌తో మున్రోను వెనక్కి పంపగా, విలియమ్సన్ (6) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మరి కొద్ది సేపటికే గప్టిల్‌ను కూడా పాండ్యా అవుట్ చేయడంతో మూడో వికెట్ కోల్పోయిన కివీస్ ప్రమాదంలో కనిపించింది. అయితే ఈ దశలో టేలర్, లాథమ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ ఆశలు ఆవిరయ్యాయి.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) బౌల్ట్ 20; ధావన్ (సి) లాథమ్ (బి) బౌల్ట్ 9; కోహ్లి (సి) బౌల్ట్ (బి) సౌతీ 121; జాదవ్ (సి అండ్ బి) సాన్‌ట్నర్ 12; దినేశ్ కార్తీక్ (సి) మున్రో (బి) సౌతీ 37; ధోని (సి) గప్టిల్ (బి) బౌల్ట్ 25; పాండ్యా (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 16; భువనేశ్వర్ (సి) నికోల్స్ (బి) సౌతీ 26; కుల్దీప్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 280.
వికెట్ల పతనం: 1–16; 2–29; 3–71; 4–144; 5–201; 6–238; 7–270; 8–280. బౌలింగ్: సౌతీ 10–0–73–3; బౌల్ట్ 10–1–35–4; మిల్నే 9–0–62–0; సాన్‌ట్నర్ 10–0–41–1; గ్రాండ్‌హోమ్ 4–0–27–0; మున్రో 7–0–38–0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) కార్తీక్ (బి) పాండ్యా 32; మున్రో (సి) కార్తీక్ (బి) బుమ్రా 28; విలియమ్సన్ (సి) జాదవ్ (బి) కుల్దీప్ 6; టేలర్ (సి) చహల్ (బి) భువనేశ్వర్ 95; లాథమ్ (నాటౌట్) 103; నికోల్స్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (49 ఓవర్లలో 4 వికెట్లకు) 284.
వికెట్ల పతనం: 1–48; 2–62; 3–80; 4–280. బౌలింగ్: భువనేశ్వర్ 10–0–56–1; బుమ్రా 9–0–56–1; కుల్దీప్ 10–0–64–1; పాండ్యా 10–0–46–1; చహల్ 10–0–51–0.
► వన్డేలో కోహ్లి సెంచరీల సంఖ్య. ఈ మ్యాచ్‌తో అతను రికీ పాంటింగ్ (30)ను అధిగమించాడు. అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లికంటే సచిన్ టెండూల్కర్ (49) మాత్రమే ముందున్నాడు.
► తన 200వ వన్డేలో సెంచరీ చేసిన రెండో ఆటగాడు కోహ్లి. గతంలో డివిలియర్స్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.
‘కివీ’ రివ్వున ఎగిరి...
Published Mon, Oct 23 2017 4:14 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment