సచిన్‌కు రాజ్యసభ అభినందన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సభ్యుల నుంచి అభినందనలు అందుకున్నాడు. ఇటీవలే అతడికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సచిన్‌ను అభినందించేందుకు పోటీ పడ్డారు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి మాస్టర్‌తో పాటు సభ్యులంతా శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం చైర్మన్ హమీద్ అన్సారీ సచిన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘సచిన్ అత్యుత్తమ ఆటగాడు. నాతోపాటు సభ మొత్తం అతడిని అభినందించేందుకు గొంతు కలుపుతుందనుకుంటున్నాను’ అని అన్సారీ చెప్పగానే సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. నామినేట్ సభ్యులు అను ఆగా సచిన్ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.