మాకు ముంగిస సాయం చేసింది: సచిన్
కోల్కతా: దాదాపు రెండు దశాబ్దాల నాటి సంఘటనను మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. గతంలో నగరంలోని ఈడెన్ గార్డెన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన హీరో కప్ సెమీ ఫైనల్లో భారత్ గెలుపొందడానికి ముంగిస సాయం చేసిందంటూ చెప్పుకొచ్చాడు.
'1993లో దక్షిణాఫ్రికాతో జరిగిన హీరో కప్ సెమీ ఫైనల్ రెండో అర్థ భాగంలో మాకు ముంగిస కనిపించింది. ముంగిస కనిపించిన కొద్ది సేపటికి మాకు కొన్ని వికెట్లు దక్కాయి. అయితే ఆ తరువాత దక్షిణాఫ్రికా మళ్లీ పుంజుకుంది. ఆ తరుణంలో ముంగిస మళ్లీ కనిపించింది. అప్పుడు మాకు మళ్లీ వికెట్లు లభించాయి. చివరి ఓవర్ లో దక్షిణాఫ్రికాకు ఆరు పరుగులు కావాల్సిన తరుణంలో నేను బౌలింగ్ కు దిగా. ఆ మ్యాచ్ లో ఆరు పరుగుల్ని సాధించలేక దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో ముంగిస శకునం మాకు బాగా కలిసొచ్చింది. మా గెలుపులో ముంగిస సాయం కూడా ఉంది. మాకు వికెట్లు కావాల్సిన ప్రతీసారి ముంగిస కోసం ఎదురు చూశాం' అని ఆనాటి జ్ఞాపకాల్ని సచిన్ నెమరవేసుకున్నాడు.