ముంబై: ప్రస్తుతం దబాంగ్-3 చిత్ర ప్రమోషన్‌లో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరనే విషయాన్ని స్పష్టం చేశాడు. భారత్-వెస్టిండీస్ జట్ల వన్డే సిరీస్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్స్ అధికారికంగా నిర్వహించిన ప్రీ-మ్యాచ్ షో పాల్గొన్న సల్మాన్.. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోని అని పేర్కొన్నాడు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ధోనినే తన ఫేవరెట్ క్రికెటర్ అని తెలిపాడు. అతనొక ‘దబాంగ్ ప్లేయర్’ అంటూ కితాబిచ్చాడు. ఇక ధోని మినహాయించి చూస్తే తనకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన క్రికెటర్ కేదార్ జాదవ్ అని అన్నాడు.
వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత నుంచి ఇప్పటివరకూ ధోని భారత జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. తన రిటైర్మెంట్‌పై ఎటువంటి స్పష్టత ఇవ్వని ధోని.. వ్యక్తిగత పనులతో బిజిబిజీగా ఉన్నాడు. ఒకవైపు కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతూనే వేరే క్రీడల్లో సరదాగా పాల్గొంటూ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ధోని ఆడతాడని, దీనికి సంబంధించి జనవరిలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లను ధోని ఆడాడు. ఇక భారత కెప్టెన్ల పరంగా చూస్తే ఒక సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోని గుర్తింపు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment