సెల్యూట్ సచిన్ | salute to sachin | Sakshi
Sakshi News home page

సెల్యూట్ సచిన్

Published Tue, Nov 5 2013 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

సెల్యూట్ సచిన్

సెల్యూట్ సచిన్

వన్డే సిరీస్‌లో భారత్ విజయం తర్వాత ఇప్పుడు పరుగుల వేదిక టెస్టులకు మారింది. సొంత గడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్ అంటే క్రికెట్ వీరాభిమాని కూడా దానిని పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో. అయితే ఇప్పుడు జరగబోయేది అలాంటిలాంటి సిరీస్ కాదు! ప్రపంచ క్రికెట్‌లో పాతికేళ్ల పాటు తనదైన ముద్ర వేసిన ఒక దిగ్గజ క్రికెటర్ రంగం నుంచి తప్పుకుంటున్న సందర్భమిది. కాబట్టి రెండు టెస్టుల్లో అతని ప్రతి కదలిక, ప్రతి పరుగుపై చర్చ సహజం... అందరికీ ఆసక్తికరం. ఈ నేపథ్యంలో 199వ టెస్టు వేదిక అయిన కోల్‌కతా ఇప్పుడు మాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నామమే జపిస్తోంది.
 
 కోల్‌కతా: సచిన్ 199వ టెస్టు మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసేందుకు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అసాధారణ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో విభిన్న తరహాలో ఇవి ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ‘ఇప్పుడు మా దగ్గర పండగ దీపావళి కాదు. సచిన్ పండగే’ అని క్యాబ్ కోశాధికారి విశ్వరూప్ డే చేసిన వ్యాఖ్య చూస్తే అవి ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.‘సెల్యూట్ సచిన్’ అనే పేరుతో ఏకంగా వారం రోజుల పాటు ఈ సంబరాలు నిర్వహిస్తుండటం విశేషం.
 
 కటౌట్ హీరో...
 కోల్‌కతా నగరం మొత్తం సచిన్ భారీ కటౌట్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. వాటిపై ప్రముఖ క్రికెటర్లు, మాజీలు సచిన్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను కూడా ముద్రించారు. ముఖ్యంగా ‘సచిన్ ఆటలో నా పోలికలు కనిపిస్తున్నాయి’ అని డాన్ బ్రాడ్‌మన్ చేసిన వ్యాఖ్య ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఏర్పాట్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ ముందు సచిన్ నిలువెత్తు మైనపు బొమ్మను ఉంచారు. మాస్టర్ అభిమాని అయిన ఒక కళాకారుడు దీనిని తయారు చేశాడు. ‘నేను దేవుడిని చూశాను. అతను భారత జట్టుకు నాలుగో స్థానంలో ఆడతాడు’ అనే మ్యాథ్యూ హేడెన్ వ్యాఖ్యను దీని పక్కన రాశారు.  రెండు రోజుల క్రితం సచిన్‌పై పీలూ భట్టాచార్య అనే గాయకుడు రూపొందిన ఆల్బమ్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి విడుదల చేశారు. ఇందులో సచిన్‌పై ఏడు బెంగాలీ, నాలుగు హిందీ పాటలు ఉన్నాయి. 100 చిత్రాలు ఉన్న సచిన్ ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు.
 
 జ్ఞాపికగా బంగారు మర్రి
 సచిన్ 199వ టెస్టు మ్యాచ్‌కు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ టాస్ వేయనున్నారు. ఈ నాణానికి ఒక వైపు సచిన్ బొమ్మ, మరో వైపు ఈడెన్ గార్డెన్స్ చిత్రం ఉంటాయి. ‘బంగారు ఆకులతో కూడిన వెండి మర్రి చెట్టు’ జ్ఞాపికను క్యాబ్, మాస్టర్‌కు అందజేయనుంది. మైదానంలోని గ్రౌండ్స్‌మెన్ కూడా ఈడెన్ గార్డెన్ బొమ్మ ఉన్న చిత్రాన్ని బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే మ్యాచ్ టికెట్లపై సచిన్ ఫొటోను ముద్రించగా...గతంలో చెప్పినట్లు ప్రతీ ప్రేక్షకుడికి సచిన్ మాస్క్ అందజేస్తే దాదాపు 70 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం మాస్టర్‌మయం కావడం ఖాయం.
 
 ప్రతీ రోజూ పండగే...
 ఐదు రోజుల ఈ మ్యాచ్‌లో ప్రతీ రోజును చిరస్మరణీయం చేయాలని క్యాబ్ భావిస్తోంది. అందుకోసం ప్రణాళికను రూపొందించింది. తొలి రోజు టికెట్లతో పాటు ప్రేక్షకులకు ప్రత్యేక సావనీర్‌ను అందజేస్తారు. రెండో రోజు ప్రతీ సీట్‌పై ప్లకార్డ్ ఉంచుతారు. వీటన్నింటినీ ప్రేక్షకులు పట్టుకొని ప్రదర్శిస్తే....అది భారీ సచిన్ బొమ్మలా కనిపిస్తుంది. మూడో రోజు సచిన్ బొమ్మ ఉన్న 199 బెలూన్లను ఎగరవేస్తారు. ఐదో రోజు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సచిన్‌ను సన్మానిస్తారు. ఈ కార్యక్రమానికి అమితాబ్, షారుఖ్ ఖాన్ కూడా హాజరు కానున్నారు. స్టేడియంపై ప్రత్యేక హెలికాప్టర్ 199 కిలోల గులాబీ పూలను వెదజల్లుతుంది. అయితే ఐదో రోజు వరకు మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే ఐసీసీ అనుమతితో నాలుగో రోజు ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.
 
 ఆటకంటే గొప్పవాడిని కాను!
 హడావిడిపై సచిన్ అసంతృప్తి
 పూలవర్షం... కటౌట్లు... భీకరమైన హడావుడి... ప్రపంచంలో ఏ క్రీడాకారుడికీ లభించని వీడ్కోలు సచిన్‌కు లభిస్తోంది. దీనికోసం అటు కోల్‌కతాలో, ఇటు ముంబైలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇదంతా సచిన్‌ను ఇబ్బందిపెడుతోందట. ప్రాక్టీస్ కోసం ఈడెన్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి జరిగిన పరిణామాల పట్ల అతను అసంతృప్తితో ఉన్నాడు. టీమ్ బస్సులోంచి టెండూల్కర్ దిగగానే ఇరు వైపులా 80 మంది పాఠశాల విద్యార్థులు సచిన్ ఫొటో, 199 రాసి ఉన్న టీ షర్ట్‌లు వేసుకొని అతనికి స్వాగతం పలికి డ్రెస్సింగ్ రూమ్ వరకు తీసుకుపోయారు. దీనిపై సచిన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘నేను ఆటకంటే గొప్పవాడిని కాను. జట్టులో మరో 14 మంది సభ్యులు కూడా ఉన్నారు’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. బహుశా ఇదే అసంతృప్తితో ఫొటో ఎగ్జిబిషన్‌కు కూడా సచిన్ రాలేదేమోనని క్యాబ్ సంయుక్త కార్యదర్శి సుజన్ ముఖర్జీ అన్నారు. అయితే ఆ తర్వాత క్యాబ్ నష్టనివారణ ప్రయత్నం చేసింది. దాంతో మైనపు బొమ్మ వద్దకు వచ్చిన సచిన్ ఫొటో దిగి, దానిని తయారు చేసిన కళాకారుడిని అభినందించాడు.
 
 సాధనపైనే దృష్టి...
 మరో వైపు తన గురించి మైదానంలోనూ, బయట జరుగుతున్న భారీ సందడిని మాస్టర్ పట్టించుకుంటున్నట్లు లేదు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సన్నాహకాల్లో భాగంగా సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో సచిన్ ఎలాంటి హడావిడి లేకుండా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈడెన్‌లో అడుగు పెట్టే ముందు మాస్టర్‌కు పూలతో స్వాగతం లభించింది. నేరుగా మైదానంలోకి వెళ్లిన సచిన్, జట్టు కోచ్ ఫ్లెచర్‌తో సుదీర్ఘంగా చర్చించాడు. అనంతరం ప్యాడ్లు కట్టుకొని తన వంతు వచ్చే వరకు నిరీక్షించి ధావన్, విజయ్‌ల తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాడు. మొత్తం 52 నిమిషాల పాటు టెండూల్కర్ ప్రాక్టీస్ సాగింది. పేస్ వికెట్‌పై ఇషాంత్, ఉమేశ్, ధోని బౌలింగ్‌లో 10 నిమిషాల పాటు సాధన చేసిన సచిన్... స్పిన్ వికెట్‌పై ఓజా, అశ్విన్, విజయ్‌లను ఎదుర్కొన్నాడు. కొద్ది సేపు ‘త్రో’లను కూడా ఆడిన తర్వాత క్యాచిం గ్ ప్రాక్టీస్‌తో సచిన్ సెషన్ ముగిసింది. అటు విండీస్ క్రికెటర్లు కూడా మూడు గంటల పాటు చెమటోడ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement