‘మోంటెకార్లో మాస్టర్’ వావ్రింకా
ఫైనల్లో ఫెడరర్‌పై విజయం
కెరీర్‌లో తొలి మాస్టర్స్ టైటిల్
ఖాతాలో రూ. 4 కోట్ల 57 లక్షల ప్రైజ్‌మనీ
మోంటెకార్లో: ఈ ఏడాది తన అద్వితీయ ప్రదర్శనను కొనసాగిస్తూ స్విట్జర్లాండ్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా కెరీర్‌లో తొలి ‘మాస్టర్స్ సిరీస్’ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్‌కే చెందిన దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్‌తో జరిగిన సింగిల్స్ ఫైనల్లో వావ్రింకా 4-6, 7-6 (7/5), 6-2తో విజయం సాధించాడు. గతంలో రోమ్, మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో ఫైనల్స్‌కు చేరుకొని రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్న 29 ఏళ్ల వావ్రింకా మూడో టోర్నీలో మాత్రం విజేతగా అవతరించాడు. గతంలో ఫెడరర్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే నెగ్గిన వావ్రింకా ఐదేళ్ల తర్వాత అతనిపై రెండోసారి గెలిచాడు. చాంపియన్‌గా నిలిచిన వావ్రింకాకు 5,49,000 యూరోలు (రూ. 4 కోట్ల 57 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది వావ్రింకా ఆస్ట్రేలియన్ ఓపెన్, చెన్నై ఓపెన్ టైటిల్స్‌ను నెగ్గాడు.
మైక్ బ్రయాన్ ‘సెంచరీ’
ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో బ్రయాన్ సోదరులు (మైక్, బాబ్) టైటిల్‌ను నెగ్గారు. ఫైనల్లో బ్రయాన్ బ్రదర్స్ 6-3, 3-6, 10-8తో ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్)లపై గెలిచారు. ఈ విజయంతో 35 ఏళ్ల మైక్ బ్రయాన్ తన ఖాతాలో 100వ టైటిల్‌ను జమచేసుకున్నాడు. తద్వారా డబుల్స్ విభాగంలో 100 టైటిల్స్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. జోడిగా ఈ కవల సోదరులకిది 98వ టైటిల్ కావడం విశేషం.