విండీస్ పై టీమిండియా ఘనవిజయం
న్యూఢిల్లీ: టీమిండియా పంజా విసిరింది. తొలి వన్డేలో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలమైన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు విశేషంగా రాణించి జయకేతనం ఎగురవేశారు. భారత్ విసిరిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ ఆటగాళ్లు తడబడి ఓటమి పాలైయ్యారు. విండీస్ ఆటగాళ్లలో స్మిత్ (97), బ్రేవో(26),పొలార్డ్ (40) పరుగులతో రాణించినా.. తరువాత ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.
చక్కటి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన విండీస్ కు రెండో వన్డే చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేవలం 46.3 ఓవర్లు మాత్రమే ఎదుర్కొన్న విండీస్ 215 పరుగులకే చాపచుట్టేసి పరాజయాన్ని కొనితెచ్చుకుంది. విండీస్ ఆటగాళ్లలో ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. భారత బౌలర్లలో మహ్మద్ షమీకి నాలుగు వికెట్లు లభించగా, జడేజాకు మూడు, మిశ్రా రెండు వికెట్లు తీశాడు. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 263 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (12), శిఖర్ ధవన్ (1) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (62), రైనా (62) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. అంబటి రాయుడు 32 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ (51 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు.