చాంపియన్‌తో ‘సై’ | Team India brace up for West Indies challenge in ICC World T20 Championships | Sakshi
Sakshi News home page

చాంపియన్‌తో ‘సై’

Published Sun, Mar 23 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

చాంపియన్‌తో ‘సై’

చాంపియన్‌తో ‘సై’

రాత్రి గం. 7.00 నుంచి
 స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 వెస్టిండీస్‌తో భారత్ పోరు నేడు
 జోరు మీద ధోనిసేన
 పటిష్టంగా కరీబియన్ జట్టు
 
 
 చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే భారత్ మరో పరీక్షకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో లీగ్ పోరుకు సమాయత్తమైంది. పాక్‌పై విజయంతో అన్ని విభాగాల్లోనూ కుదురుకొని జోరు మీద ఉన్న ధోని సేనకు... కరీబియన్ జట్టుపై గెలవడం చాలా కీలకం. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే... తర్వాతి మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌పై గెలిచి, ఆసీస్ చేతిలో ఓడినా సెమీస్ అవకాశాలకు ఢోకా ఉండదు.
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 పాకిస్థాన్‌పై విజయం ద్వారా భారత్‌కు టి20 ప్రపంచకప్‌లో ఒక పెద్ద తలనొప్పి తగ్గింది. అది జట్టు కూర్పు. ఈసారి స్పిన్నర్లదే హవా అనే అంశాన్ని గుర్తించిన భారత జట్టు ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగి దాయాదిపై ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ టోర్నీలో తర్వాతి మ్యాచ్‌ల్లోనూ భారత్ జట్టు దాదాపుగా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతుంది.
 
 అయితే రెండో మ్యాచ్‌లో భారత్‌కు మరింత ప్రమాదకరమైన జట్టు ఎదురవుతోంది. భారీ హిట్టర్లున్న వెస్టిండీస్‌తో ఆదివారం షేరే బంగ్లా స్టేడియంలో ధోని బృందం తలపడనుంది. స్యామీ సారథ్యంలోని కరీబియన్ జట్టు ఈ ఫార్మాట్‌లో దిట్ట. ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలోనూ అలవోక విజయాలు సాధించింది. ఈ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు మరో ఆసక్తికర సమరాన్ని ఆశించవచ్చు.
 
 పెరిగిన ఆత్మవిశ్వాసం
 ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో గాడిలో పడ్డ భారత్ జట్టు పాక్‌తో మ్యాచ్ ద్వారా మరింత ఆత్మవిశ్వాసం సంపాదించుకుంది. ముఖ్యంగా బౌలింగ్, ఓపెనర్ల విషయంలో ఉన్న ఆందోళన పాక్‌తో మ్యాచ్ ద్వారా తొలిగింది. అయితే షార్ట్‌పిచ్ బలహీనత ఇంకా బ్యాట్స్‌మెన్‌ను వెంటాడుతోంది. శిఖర్ ధావన్ పాక్‌పై అవుటైన తీరు దీనికి ఉదాహరణ. రోహిత్, ధావన్ ఇద్దరూ గాడిలో పడ్డట్లే కనిపిస్తున్నారు. కోహ్లి, రైనా ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాకపోతే యువరాజ్ వరుస వైఫల్యం కాస్త ఆందోళన పరిచే అంశం.
 
 యువీ కూడా కుదురుకుంటే ఇక భారత బ్యాటింగ్‌కు ఎదురుండదు. స్లాగ్ ఓవర్లలో హిట్టింగ్ చేయడానికి ధోని, జడేజా, అశ్విన్ సిద్ధంగా ఉన్నారు. ఈ ముగ్గురూ ప్రాక్టీస్ సెషన్‌లలో కేవలం భారీ షాట్లు ఆడటం మాత్రమే ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. ఇక బౌలింగ్ విభాగంలో పూర్తిగా స్పిన్ త్రయంపైనే మరోసారి భారం. పాక్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌తో తొలి ఓవర్ బౌలింగ్ చేయించిన ధోని... క్రిస్ గేల్ మీద కూడా అదే ఆయుధాన్ని ప్రయోగిస్తాడేమో చూడాలి.
 
 నరైన్, బద్రీ కీలకం
 ఇక వెస్టిండీస్ విషయానికొస్తే ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ మొత్తం టి20 హిట్టర్‌లతో నిండిపోయి ఉంది. ఓపెనర్లు గేల్, డ్వేన్‌స్మిత్‌లు ఆరు ఓవర్ల పాటు ఆడితే పవర్ ప్లేలోనే మ్యాచ్ విండీస్ చేతికి వస్తుంది. శామ్యూల్స్, డ్వేన్ బ్రేవో, రస్సెల్, స్యామీలాంటి ఆల్‌రౌండర్లతో పాటు సిమ్మన్స్, చార్లెస్‌లలో ఒకరు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ రామ్‌దిన్ కూడా ఈ ఫార్మాట్‌లో ప్రమాదకర ఆటగాడు. కనీసం 8 మంది నాణ్యమైన బ్యాట్స్‌మెన్ అందుబాటులో ఉండటం ఈ జట్టు బలం.
 
 ఇక బౌలింగ్‌లో రామ్‌పాల్‌తో పాటు స్యామీ, రస్సెల్, బ్రేవో పేస్ బాధ్యతలు తీసుకుంటారు. వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తే నరైన్‌తో పాటు లెగ్ స్పిన్నర్ బద్రీ ఇద్దరూ ప్రమాదకరం. బద్రీ పవర్ ప్లేలోనే బౌలింగ్ చేసే అవకాశం ఉంది. శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో నరైన్ ఇప్పటికే తన ఫామ్ గురించి సంకేతాలు పంపాడు. ఈ నేపథ్యంలో నరైన్, బద్రీలను భారత బ్యాట్స్‌మెన్ ఎంత సమర్థంగా ఎదుర్కొంటారనే అంశంపైనే భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
 
 యువీ టాప్ స్కోరర్
 ఇదేంటి..? యువరాజ్ పాక్‌పై విఫలమయ్యాడని అనుకుంటున్నారా...? అక్కడ విఫలమైనా... భారత జట్టు ఆడిన ఫుట్‌బాల్‌లో మాత్రం యువీనే టాప్ స్కోరర్. శనివారం మధ్యాహ్నం భారత జట్టు ప్రాక్టీస్‌లో తొలుత ఆటగాళ్లు అరగంటకు పైగా ఫుట్‌బాల్ ఆడారు. ఇందులో ధోని జట్టులో ఉన్న యువరాజ్.... కోహ్లి జట్టుపై కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేశాడు. అయితే ధావన్ ఒక్కడు మాత్రం ఫుట్‌బాల్‌కు దూరంగా ఉన్నాడు. పాక్‌పై షార్ట్‌పిచ్ బంతికి అవుటైన నేపథ్యంలో నెట్స్‌లోకి వెళ్లి షార్ట్‌పిచ్ బాల్స్ ఆడటం ప్రాక్టీస్ చేశాడు.
 
 రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ 3 టి20లు జరిగితే భారత్ 1 మాత్రమే గెలిచింది. టి20 ప్రపంచకప్‌లలో రెండు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలిచింది.
 
 జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, యువరాజ్, కోహ్లి, రైనా, జడేజా, అశ్విన్, మిశ్రా, భువనేశ్వర్, షమీ. వెస్టిండీస్: స్యామీ (కెప్టెన్), గేల్, స్మిత్, శామ్యూల్స్, రస్సెల్, సిమ్మన్స్, బ్రేవో, రామ్‌దిన్, రామ్‌పాల్, నరైన్, బద్రీ.
 
 పాకిస్థాన్‌పై విజయం ద్వారా మేం పూర్తిగా గాడిలో పడ్డాం. అయితే ఇంకా   మేం చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వెస్టిండీస్ జట్టులో మంచి హిట్టర్స్ ఉన్నా... మిశ్రా, అశ్విన్ వారిని నియంత్రించగలరనే నమ్మకం ఉంది. ఇటీవల దొరికిన ఖాళీ సమయం వల్ల నా ఆటను విశ్లేషించుకున్నా. నెట్స్‌లో బాగా కష్టపడ్డా. వన్డేలకు, టి20లకు చాలా తేడా ఉంది. ఏ ఫార్మాట్‌లో అయినా పరిస్థితిని బట్టి ఆడాలి    
 - సురేశ్ రైనా
 
 మా జట్టు మంచి సమతూకంతో ఉంది. ఈ ఫార్మాట్‌లో అందరికీ బాగా అనుభవం ఉంది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఆడటం కచ్చితంగా ఒత్తిడితో కూడుకున్న అంశమే. గత ప్రపంచకప్‌లో మేం సమష్టిగా ఆడి గెలిచాం. ఈసారి కూడా అదే నమ్మకంతో ఉన్నాం. మా జట్టులో కనీసం ఆరుగురు స్పిన్‌ను సమర్థంగా ఆడగల బ్యాట్స్‌మెన్ ఉన్నారు.     
 - డారెన్ స్యామీ
 
 వాతావరణం
 ఈ మ్యాచ్‌కు వర్షం ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా. గత వారం రోజులుగా ఢాకాలో వర్షం పడలేదు. శనివారం కూడా ఎండ బాగా కాచింది. కానీ వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా. పాక్‌తో మ్యాచ్ రోజు కూడా బాగా మబ్బులుపట్టి ఉన్నా వర్షం పడలేదు. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా భావిస్తున్న ఈ గ్రూప్‌లో సమీకరణాలు మారే అవకాశం ఉంది.
 
 పిచ్
 ముందే అనుకున్నట్లు పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. మంచు, వర్షం వస్తే డక్‌వర్త్ లూయిస్ అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement