ఇరానీ కప్ మ్యాచ్‌లో వసీం జాఫర్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగానే అందరికంటే ముందుగా 18 ఏళ్ల ముంబైకర్ పృథ్వీ షా చప్పట్లతో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. జాఫర్ 18 ఏళ్ల వయసులో ముంబై తరఫున తన రెండో మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకట్టుకున్నప్పుడు పృథ్వీ ఇంకా పుట్టనే లేదు... అతను తొలి టెస్టు ఆడే సమయానికి పృథ్వీకి 3 నెలలు మాత్రమే! భారత క్రికెట్ అడ్డాలాంటి ముంబై నుంచి వచ్చిన ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఒక తరంలాంటి అంతరం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో వసీం జాఫర్ ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తుంటే 22 ఏళ్ల క్రితం అతను తొలి మ్యాచ్ ఆడాడని, ప్రస్తుతం అతని వయసు 40 ఏళ్లంటే నమ్మడం కష్టం.
సాక్షి క్రీడావిభాగం: భారత్ తరఫున ఎనిమిదేళ్ల వ్యవధిలో వసీం జాఫర్ 31 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 34.10 సగటుతో 1,944 పరుగులు చేశాడు. వాటిలో 5 సెంచరీలు (2 డబుల్ సెంచరీలు), 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదేమీ పేలవమైన రికార్డు కాదు. కానీ 2008 తర్వాత అతనికి మళ్లీ టీమిండియా అవకాశమే దక్కలేదు. ఆ తర్వాత కూడా రంజీ ట్రోఫీలో టన్నుల కొద్దీ పరుగులు సాధించినా... అప్పటికే సెహ్వాగ్, గంభీర్ జోడీ నిలదొక్కుకోవడంతో జాఫర్‌కు నిరాశ తప్పలేదు.
కానీ అతను మాత్రం దేశవాళీలో భారీగా పరుగులు చేస్తూ పోయాడు. స్కూల్ క్రికెట్‌లో 400 పరుగుల స్కోరు సాధించినప్పటి నుంచి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం అలవాటుగా మార్చుకున్న జాఫర్... ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు (10,665) చేసిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా అతని పరుగుల దాహం తగ్గలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50కు పైగా సెంచరీలు సాధించిన ఎనిమిది మంది భారత బ్యాట్స్‌మెన్‌లో జాఫర్ కూడా ఒకడు. ఎనిమిది సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన జట్టులో భాగమై, వాటిలో రెండు సార్లు కెప్టెన్‌గా కూడా ఉన్న జాఫర్ కెరీర్ మూడేళ్ల క్రితం మరో మలుపు తిరిగింది. వేర్వేరు కారణాలతో అతను సొంత టీమ్ ముంబై నుంచి విదర్భకు మారాడు.
తొలి రెండు సీజన్లు విదర్భ అంతంత మాత్రం ప్రదర్శనే కనబర్చింది. అయితే ఈసారి జాఫర్ సీనియర్ ఆటగాడిగా, మెంటార్‌గా తన బాధ్యతను మరింత సమర్థంగా నిర్వర్తించాడు. తను అనుభవాన్నంతా రంగరించి కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. తాను కూడా 54.09 సగటుతో 595 పరుగులు చేసి విదర్భ తొలిసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా రెస్టాఫ్ ఇండియాతో అతని ఇన్నింగ్స్‌పై మాజీ సహచరులు గంగూలీ, లక్ష్మణ్‌లతో సహా అనేక మంది ఆటగాళ్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఐదుగురు మాత్రమే 40 ఏళ్లు దాటిన తర్వాత ట్రిపుల్ సెంచరీ నమోదు చేయగలిగారు. జాఫర్ దానికి మరో 15 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న అతనికి దీనిని అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
- 6 ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వసీం జాఫర్ 18 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, విజయ్ హజారే తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment