హర్షా భోగ్లే
కొన్నిసార్లు టోర్నీ మధ్యలో జరిగే మ్యాచ్‌లు ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా జరిగిపోతుంటాయి. కొంత ఇబ్బందిగా ఉన్నా ఆయా జట్లకు ఇంకా అవకాశాలు మిగిలి ఉండడమే దీనికి కారణం. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ సమయంలో జరిగే మ్యాచ్‌లు పటిష్టంగా కనిపించే జట్ల అవకాశాలను తారుమారు చేసే విధంగా మారతాయి. బెంగళూరు జట్టుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం ఇలాంటి తరహాలోనిదే. ఇక గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మ్యాచ్ కూడా ఇలాగే జరుగుతుందని నమ్ముతున్నాను.
గత వారం దాకా లయన్స్ జట్టు పేరుకు తగ్గట్టుగా ప్రత్యర్థులకు సింహస్వప్నంగా కనిపించింది. తాము ఎన్ని పరుగులు సాధించినా ఆ జట్టు ఛేదిస్తుందనే భయాన్ని ఇతర జట్లకు కలిగించింది. త్వరగా ప్రారంభ వికెట్లను తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేది. అయితే ఇప్పుడు ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. మరో మ్యాచ్‌లో కూడా ఓడితే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిని కచ్చితంగా నెగ్గాల్సి రావచ్చు. అందుకే ఈ మ్యాచ్‌లో విజయం వారికి తప్పనిసరి. మరోవైపు హైదరాబాద్ జట్టు జోరందుకుంది. తమ చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి దూసుకెళుతోంది.
ఇంతకాలం వారి బ్యాటింగ్ అంతా కెప్టెన్ డేవిడ్ వార్నర్ మీదే ఆధారపడింది. అయితే తాజాగా కేన్ విలియమ్సన్ రాకతో ఈ పరిస్థితి మారింది. రెండేళ్ల క్రితం యార్క్‌షైర్ తరఫున ఆడడానికి వెళ్లిన కేన్ మరింతగా రాటుదేలాడు. తను కచ్చితంగా జట్టుకు ఉపయోగపడతాడనడంలో సందేహం లేదు. అయితే ఈ జట్టుకు మరో నాణ్యమైన బ్యాట్స్‌మన్ కొరత ఉంది. భువనేశ్వర్, ముస్తాఫిజుర్, నెహ్రా, శరణ్, హెన్రిక్స్‌తో బౌలింగ్ పటిష్టంగానే ఉంది. ఆల్‌రౌండర్‌గా హెన్రిక్స్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. ఏది ఏమైనా లయన్స్‌పై గెలుపు జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఒకవేళ రైనా బృందం విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు వెళుతుంది.
విలియమ్సన్‌తో పరిస్థితి మారింది
Published Fri, May 6 2016 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM
Advertisement
Advertisement