యాసిర్‌ ఇచ్చేశాడు.. బాదేశాడు | Yasir Shah Hits Maiden Test Hundred | Sakshi
Sakshi News home page

యాసిర్‌ ఇచ్చేశాడు.. బాదేశాడు

Published Mon, Dec 2 2019 4:13 AM | Last Updated on Mon, Dec 2 2019 1:28 PM

Yasir Shah Hits Maiden Test Hundred  - Sakshi

అడిలైడ్‌: యాసిర్‌ షా తన చెత్త బౌలింగ్‌తో విరివిగా పరుగులిచ్చుకున్నాడు. ఒక్క వికెటైనా తీయకుండా దాదాపు రెండొందల (197) పరుగులు సమర్పించుకున్నాడు. అదే యాసిర్‌ షా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ కాదు... మిడిలార్డర్‌లో దిగలేదు... కానీ ఈ బౌలర్‌ టెయిలెండర్‌గా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ‘శత’క్కొట్టాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 96/6తో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 94.4 ఓవర్లలో 302 పరుగుల వద్ద ఆలౌటైంది. యాసిర్‌ షా (213 బంతుల్లో 113; 13 ఫోర్లు) పోరాటపటిమ కనబరిచాడు. ప్రధాన బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌తో కలిసి మూడో రోజు ఆట ప్రారంభించిన యాసిర్‌ ఓ బ్యాట్స్‌మన్‌ను తలపించాడు.

ఇద్దరు కుదురుగా ఆడటంతో ఆసీస్‌ బౌలర్లకు వికెట్‌ తీయడం కష్టమైంది. మొదట బాబర్‌ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... ఇతని అండతో నింపాదిగా ఆడిన యాసిర్‌ షా కూడా ఫిఫ్టీ చేశాడు. సాఫీగా సాగుతున్న భాగస్వామ్యాన్ని స్టార్క్‌ విడదీశాడు. సెంచరీకి కేవలం మూడే పరుగుల దూరంలో ఉన్న బాబర్‌... స్టార్క్‌ బౌలింగ్‌లో కీపర్‌ పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో ఏడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇదే జోరుతో స్టార్క్‌ తన మరుసటి బంతికి షాహిన్‌ ఆఫ్రిది (0)ని ఎల్బీగా డకౌట్‌ చేశాడు. 213/8 స్కోరు వద్ద పాక్‌ భోజన విరామానికెళ్లింది. అనంతరం మొహమ్మద్‌ అబ్బాస్‌ (78 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కుదురుగా ఆడటంతో యాసిర్‌ షా సెంచరీ దిశగా సాగాడు.

192 బంతుల్లో 12 ఫోర్లతో కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో వికెట్‌కు 87 పరుగులు జోడించాక అబ్బాస్‌తో పాటు జట్టు స్కోరు 300 పరుగులు దాటాక యాసిర్‌ను కమిన్స్‌ ఔట్‌ చేయడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ్రస్టేలియాకు 287 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో పాక్‌ ఫాలోఆన్‌ ఆడాల్సి వచ్చింది. ఆట ముగిసే సమయానికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 39 పరుగులు చేసింది. షాన్‌ మసూద్‌ (14 బ్యాటింగ్‌), అసద్‌ షఫీక్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అజహర్‌ అలీ (9)ని స్టార్క్‌... ఇమామ్‌ (0), బాబర్‌ (8)లను హాజల్‌వుడ్‌ పెవిలియన్‌ పంపారు.

►13 పదమూడేళ్ల తర్వాత పాక్‌ తరఫున నంబర్‌–8లో వచ్చిన బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేశాడు. చివరిసారి 2006 కరాచీలో భారత్‌తో టెస్టులో కమ్రాన్‌ అక్మల్‌ (113) ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా పాక్‌ తరఫున తొమ్మిది మంది నంబర్‌–8లో వచ్చి సెంచరీలు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement