ఆస్కా ఆధిపత్యం ఎవరికో! | Andhra Social and Cultural Association | Sakshi
Sakshi News home page

ఆస్కా ఆధిపత్యం ఎవరికో!

Published Sun, Oct 25 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

Andhra Social and Cultural Association

చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్(ఆస్కా)పై ఆధిపత్యం ఎవరికో అనేది నేటితో  తేలిపోనుంది. రెండు ప్యానళ్ల నుంచి హేమా హేమీలు తల పడుతుండగా ఆదివారం పోలింగ్ జరుగనుంది. చెన్నైలో ఆంధ్రాక్లబ్ అంటే అదో చరిత్ర. ఆస్కాలో సభ్యత్వం అంటే అదో గొప్ప. ఆస్కా పాలకవర్గంలో ఉండడం అంటే అదో ప్రతిష్ట. అయితే ప్రతిష్ట కోసం పాకులాడేవారు కొందరైతే ఆ ప్రతిష్టకు మరింత వన్నె తెచ్చేలా సేవాభావంతో వ్యవహరించేవారు కొందరు ఉన్నారు. ఇలా అనేక మనస్తత్వాలు కలిగినవారు మిళితమై సుబ్బారెడ్డి, రావి సాంబశివరావుల నేతృత్వంలో రెండు ప్యానళ్లుగా ఏర్పడ్డారు. రెండుప్యానళ్ల వారు గతంలో పగ్గాలు చేపట్టి తామేమిటో, తమ పనితీరు ఏపాటిదో నిరూపించుకున్నవారే.
 
 ఆస్కా ఓటర్లకు సైతం ఇరు ప్యానళ్ల అభ్యర్థుల తీరు అవగతమే. గతంలో ఆస్కా ప్రతిష్టను పెంచినవారేగాక అప్రతిష్టపాలు చేసిన వారు, ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వారు, ఆస్కాను నష్టాల్లోకి నెట్టినవారు కూడా పోటీపడుతున్నారు. ఇటువంటి ప్యానళ్ల నడుమ జరుగుతున్న పోటీపై సహజంగానే ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. శుక్రవారం రాత్రి విందు ఇచ్చి సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమ ప్యానల్ గెలిస్తే ఏవిధంగా పాటుపడుతామో సభ్యులకు వివరించుకున్నారు.        ఆస్కాను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలంటే సభ్యులందరి సహకారం తప్పనిసరి. అందునా ముఖ్యంగా ఆస్కా పాలకవర్గంలోని ఆఫీస్ బేరర్స్, కమిటీ మెంబర్ల సహకారం మరింత ముఖ్యం.
 
  ఆస్కా అధ్యక్షుడిగా గతంలో మంచిపేరు తెచ్చుకున్న కే సుబ్బారెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఇక మిగిలింది కార్యదర్శి తదితరుల ఎన్నికే. అధ్యక్ష స్థానంలో ఉన్నవారికి మంచిమనసున్నా  పాలనాపరమైన ప్రగతిలో మద్దతు కూడా అవసరమే. ఒకరు ఎస్ అంటే మరొకరు నో అన్నపక్షంలో ఆస్కా పాలన మరోసారి గాడి తప్పడం ఖాయం. రెండు ప్యానళ్లలో ఎక్కువ స్థానాలు గెలుపొందినవారిదే ఆధిపత్యంగా మారుతుంది. ఆస్కాలో అధ్యక్షుల తరువాత కీలకమైన ది కార్యదర్శి స్థానం. గతంలో కార్యదర్శిగా పనిచేసిన రావి సాంబశివరావు ఒక ప్యానల్ నుంచి మరోసారి కార్యదర్శి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
 
  అలాగే సుబ్బారెడ్డి ప్యానల్ నుంచి కార్యదర్శి అభ్యర్ధిగా రాజకీయ ఉద్దండులైన చక్రవర్తినాయుడు తలపడుతున్నారు. ఇక మిగిలిన ఆఫీస్ బేరర్ల స్థానాల్లో సైతం వివిధ రంగాల ప్రముఖులు పోటీలో ఉన్నారు. సభ్యుల ఓట్ల మద్దతు కూడగట్టేందుకు ఇరు ప్యానళ్లవారు తెలుగు రాష్ట్రాలతోపాటూ తమిళనాడులో కూడా పర్యటించారు. ఈ ఆదివారం పోలింగ్ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆస్కా సభ్యులు బస్సులు, రైళ్లలో, విమానాల్లో చెన్నైకి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పోలింగ్ ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఆదివారం అర్ధరాత్రి సమయానికి ఆస్కా ఫలితాలు వెల్లడికావచ్చని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement