‘ఆప్’ తీర్థం
Published Sat, Mar 1 2014 11:57 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
అణు వ్యతిరేక ఉద్యమ నాయకుడు ఉదయకుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఆయనతో పాటుగా పలువురు ఉద్యమ నాయకులు ఆప్ బాట పట్టారు. అయితే, ఆయన నిర్ణయాన్ని ఇడిందైరె వాసులు వ్యతిరేకిస్తుండడంతో అణువ్యతిరేక ఉద్యమంలో చీలిక ఏర్పడింది.
సాక్షి, చెన్నై: తిరునల్వేలి జిల్లా కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఇడిందకరై వేదికగా పెద్ద ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ఉదయకుమార్, పుష్పరాయన్, ఏసురాజన్‌లు రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు నిర్ణయించారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అణు విద్యుత్ కేంద్రాలను దేశంలో నెల కొల్పొద్దంటూ నినదిస్తున్న ఆమ్ ఆద్మీలోకి చేరాలని నిర్ణయించారు. ఆపార్టీ సీనియర్లతో ఢిల్లీలో మంతనాలు జరిగాయి. అణు వ్యతిరేక ఉద్యమకారులు ఆప్ తీర్థం పుచ్చుకోవడంతో పాటుగా ఆపార్టీ తరపున రా ష్ట్రంలో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అయ్యారు.
తీర్థం: ఇడిందకరై వేదికగా శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఉదయకుమార్, పుష్పరాయన్, ఏసురాజన్‌తో పాటుగా ఆ పరిసర గ్రామాల ప్రజలు ఆమ్ ఆద్మీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ టోపీ ధరించి, చీపురు చేతబట్టారు. చీపురు సాయంతో రాష్ట్రం నుంచి అణు విద్యుత్ కేంద్రాన్ని తరిమి కొడతామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.
తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాల బరిలో పోటీకి సిద్ధమవుతున్నామని ప్రకటించారు. ఈ మూడు స్థానాల కైవసంతో అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమానికి బలం చేకూరినట్టు అవుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యతిరేకత: ఉద్యమ నాయకులు రాజకీయబాట పట్టడంతో పరిస్థితులు ఉద్యమంలో చీలిక కు దారి తీస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని ఇన్నాళ్లుసాగిస్తూ రాగా, ప్రస్తుతం నేతలు ఆప్‌లోకి వెళ్లడంతో వ్యతిరేకత బయలు దేరింది. ఏళ్ల తరబడి ఉద్యమంలో పాల్గొంటూ వస్తున్న వారిలో ఓ వర్గం రాజకీయ బాటను తీవ్రంగా వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. తామంతా ఏళ్ల తరబడి ఉదయకుమార్‌కు అండగా ఉంటూ వస్తుంటే, ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం ఎంత వరకు సమంజసమంటూ ఇడిందకరై పరిసరాల్లోని కొన్ని గ్రామాల్లో చర్చ మొదలైంది. ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా ఆ గ్రామాల ప్రజలు తప్పుబడుతున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చడం లక్ష్యంగా ఈ కుట్ర పన్నినట్టుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వివరణ: తమకు గ్రామాల్లో వ్యతిరేకత బయలుదేరడంతో ఉద్యమ నేతలు కంగు తిన్నారు. ప్రజల అండదండలతో ఓట్లు రాబట్టుకోవచ్చన్న ఆశతో ఉన్న నాయకులు డైలమాలో పడ్డారు. ఎట్టకేలకు ప్రజలను బుజ్జగించే రీతిలో ఉద్యమం తమ చేతిలోనే ఉందని చాటుకునే పనిలో పడ్డారు. ఉదయకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు వివరణ ఇచ్చారు. ఉద్యమంలో ఎలాంటి చీలిక ఏర్పడ లేదని స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా, తమకు ఉద్యమమే కీలకమని పేర్కొన్నారు.
ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సి వస్తున్న దృష్ట్యా, ఆప్‌లోకి చేరాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే, అణు ప్రాజెక్టుల్ని మరింత వేగవంతం చేయడం తథ్యమన్నారు. ఒక వేళ బీజేపీ పగ్గాలు చేపట్టిన పక్షంలో ఉద్యమాన్ని ఉక్కు పాదంతో వాళ్లు అణచి వేస్తారని చెప్పారు. అందువల్లే ప్రత్యామ్నాయంగా ఉద్యమానికి మద్దతుగా, అణు విద్యుత్‌కు వ్యతిరేకంగా ముందుకె ళుతున్న ఆప్‌లోకి చేరాల్సి వచ్చిందన్నారు. ఇక్కడి నుంచి ఉద్యమ ప్రతినిధులు పార్లమెంట్‌లో అడుగు పెట్టిన పక్షంలో, కూడంకులం కేంద్రాన్ని తప్పకుండా మూసి వేయించ గలరని, ఇందుకు ఆప్ అధినేత కేజ్రీ వాల్ సైతం హామీ ఇచ్చారంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.
Advertisement