బాబు వచ్చె.. సెలవులు తెచ్చె..
- జిల్లాలో ప్రైవేట్ విద్యార్థులకు రెండు రోజులు అనధికారిక సెలవు
- సీఎం పర్యటనకు బలవంతంగా స్కూల్ బస్సుల తరలింపు
- బదులుగా సెలవుల్లో స్కూళ్లు పెట్టుకోవాలంటూ ఉచిత సలహా
- తప్పుబడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఏం చేసుకుంటారే ఏమో తెలీదు. మీ బస్సులను ముఖ్యమంత్రి కార్యక్రమాలకు పంపాలి. ఇది కలెక్టరు ఆర్డరు. కాదుగీదంటే మీ ఇష్టం. రేప్పొద్దున కలిగే ఇబ్బందులకు మేము బాధ్యులం కాము. ఆరోజు ఎవరూ కాపాడలేరు.
-ఇదీ ఆర్టీఏ, విద్యాశాఖ
అధికారులు ప్రైవేట్ విద్యా
సంస్థలకు చేసిన బెదిరింపులు.
ఆదివారం, రెండో శనివారం, పండుగలు, ప్రముఖుల జయంతి, వర్ధంతిలకు ప్రభుత్వ సెలవులు ఇవ్వడం పరిపాటి. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలకు గురు, శుక్రవారాలు సెలవులిచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన. సీఎం పర్యటించే ప్రాంతాలకు ప్రజలను తరలించడానికి దాదాపు ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను బలవంతంగా తీసుకెళ్లారు.
ఎంకిపెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చిన్నట్టు.. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన విద్యార్థులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మామూలుగానైతే ఓ గంటపాటు అదనంగా తరగతులు పెట్టుకున్నా...సెలవురోజు తరగతులు పెట్టుకున్నా...ఆయా విద్యా సంస్థలపై నానాయాగీ చేసే అధికారులు ఇప్పుడేమో ఏకంగా రెండు రోజులుఅనధికారికంగా సెలవులు ఇచ్చారు. విద్యాశాఖ, ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించి బలవంతంగా ఒప్పించి స్కూలు బస్సులను సీఎం పర్యటనకు తరలించారు. సెలవుల్లోనేతే బస్సులను పంపేందుకు తమకేమీ బాధ లేదని, విద్యా సంస్థలు నడుస్తున్న రోజుల్లో ఇలా బలవంతం చేస్తే ఏం చేయాలంటూ ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు వాపోతున్నాయి.
ఇదిలాఉండగా గురువారం, శుక్రవారం ఇచ్చే సెలవులకు బదులుగా భవిష్యత్తులో ఏదైనా రెండో శనివారం, ఆదివారం లేదా ఇతర సెలవుల్లో విద్యా సంస్థలు నడుపుకోవాలంటూ విద్యాశాఖ అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు స్వయగా ఫోన్లు చేసి మరీ బస్సులను పంపాలని ఆదేశించడం విశేషం. ఓ విద్యా సంస్థ అధినేతే డీఈఓకు ఫోన్‌చేసి ‘సార్...బస్సులు పంపడం వీలు కాదు. పిల్లలకు ఇబ్బంది అవుతుంద’ని చెప్పుకొచ్చారు. ‘అదేందయ్యా...రెండ్రోజులు సెలవులిచ్చేయండి, ఇది కలెక్టరు ఆర్డరు అని చెబుతున్నా కదా. ఖచ్చితంగా బస్సులు పంపాల్సిందే’నంటూ తేల్చిచెప్పినట్లు తెలిసింది.
375 బస్సులు టార్గెట్
సీఎం పర్యటనకు విద్యా సంస్థల నుంచి 375 బస్సులను వినియోగించుకోవాలని ఆర్టీఏ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. బస్సుల తరలింపు బాధ్యతను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు) డి.శ్రీనివాసులు, డి.మనోహర్‌రెడ్డి, ఎంజే.పద్మభూషణరెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఎస్.రమేష్, జి.శివారెడ్డి, సి.వాసుదేవరెడ్డి, వై.విశ్వనాథరెడ్డి తీసుకున్నారు. వీరు స్వాధీనం చేసుకున్న బస్సులను డీఆర్డీఏ, మెప్మా, హార్టికల్చర్, పశు సంవర్థకశాఖ, మైనర్ ఇరిగేషన్, హ్యాండ్‌లూమ్ శాఖల అధికారులకు అప్పగించారు. వారు ఆయా మండలాలకు తరలించారు.
తప్పుబడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
ముఖ్యమంత్రి పర్యటనకు ప్రజల తరలింపుపై అభ్యంతరం లేదుకానీ, ప్రైవేటు విద్యా సంస్థలకు అనధికారిక సెలవులు ఇచ్చి మరీ వాటి బస్సులను వినియోగించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. అవసరమనుకుంటే డబ్బు ఖర్చుచేసి ప్రైవేట్ వాహనాలను సమకూర్చుచకోవాలి కానీ ఇలా విద్యా సంస్థల బస్సులను బలవంతంగా తీసుకెళ్లడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ రథసారథులే ఇలా...విద్యార్థులకు ఇబ్బందులు కలిగేంచే వాటికి ఒడిగట్టడం ఏం బాగోలేదంటున్నారు.