చెన్నై, సాక్షి ప్రతినిధి: తొమ్మిదేళ్లు తమతో స్నేహం చేసిన డీఎంకేకు అకస్మాత్తుగా తమపై ఎందుకంత కోపమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ వ్యాఖ్యానించగా, బీజేపీతో చెలిమి చేయదలుచుకుంటే తాము పరిశీలిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలాసీతారామన్ ఇప్పటికే ప్రకటించారు. రెండు జాతీయ పార్టీలు తమతో దోస్తీకి పాకులాడుతున్నాయని కరుణ భావిస్తున్నారు. అయితే పైకి కాంగ్రెస్‌తో పొత్తు లేదని స్పష్టంగా చెప్పిన కరుణ, బీజేపీతో మాత్రం పొత్తు లేదని నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నారు. ఈలం తమిళుల సమస్యలో తనకుతానుగా అప్రతిష్టపాలైనా, 2 జీ స్పెక్ట్రం కేసులో తన గారాలపట్టి కనిమొళిని కటకటాలపాలు చేయడంలో కాంగ్రెస్ చూపిన ఉత్సాహాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇదే అదనుగా కాంగ్రెస్ కూడా కరుణానిధిపై విమర్శలు చేస్తోంది.
తమ పార్టీ అంటే అంతగా పడనప్పుడు ఇటీవల జరి గిన ఎన్నికల్లో కనిమొళి గెలుపునకు కాంగ్రెస్ మద్దతు ఎందుకు కోరారని ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం లేని అయిష్టత ఇపుడు ఎలా ముందుకొచ్చిందనే విమర్శకు కరుణ బదులివ్వలేక పోతున్నారు. కాంగ్రెస్‌తో కయ్యానికి సిద్ధమైన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం పెడుతున్న ముసాయిదా బిల్లును ఉభయసభల్లో బలపరుస్తారా అని కరుణానిధిని మీడియా ప్రశ్నిం చగా, ఈ వ్యవహారాలన్నీ డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు చూస్తున్నారని దాటవేశారు. కరుణ కాంగ్రెస్‌కు దూరమైన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీపై సంధించిన వ్యంగ్యాస్త్రాలపై కూడా ఆయన ధన్యవాదాలంటూ ప్రతిస్పందించారు.
అన్నాడీఎంకే ఎలాగూ కలిసి వచ్చే అవకాశం లేనందున డీఎంకేతో పొత్తుపెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలు సైతం పరోక్షంగా చెబుతున్నారు. అయితే కరుణానిధి మాత్రం ఇప్పటికీ కొట్టి పారేస్తున్నారు. బీజేపీ మద్దతు పొందాలనే విషయంలో ఇంత వరకు తాము ఒక అభిప్రాయానికి రాలేదన్నారు. ఈ ఉద్దేశంతో ఆ పార్టీకి ఉత్తరం కూడా రాయలేదని వ్యాఖ్యానించారు. పొత్తు విషయమై జాతీయ పార్టీలతో సంప్రదింపులు జరపలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో తె గదెంపులు చేసుకున్నట్లు వ్యవహరిస్తున్న కరుణ బీజేపీవైపు ఎంతో కొంత మొగ్గుచూపుతూనే, మేకపోతు గాంభీర్యంతో ఒంటరిపోరుకు సిద్ధమని ప్రకటించారు.
కరుణతో ముస్లింలీగ్
ఇండియా యూనియన్ ముస్లింలీగ్ అధినేత ఖాదర్‌మొహిద్దీన్ మంగళవారం కరుణానిధిని కలిసి డీఎంకేతో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. మొిహ ద్దీన్ మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేతో నిన్న ఉన్నాము, నేడు, రేపుకూడా ఉంటామని అన్నారు. ముఖ్యమంతులు తాము ప్రధాని అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారంటూ పరోక్షంగా అన్నాడీఎంకే అధినేత్రిని విమర్శించారు. ప్రధాని ఎవరనేది ప్రజలు నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. డీఎంకేతో పెద్ద పార్టీలు కలిసినా కలవకున్నా తమవంటి చిన్నపార్టీల కలయితో మెజార్టీ స్థానాల్లో గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు.
ఒంటరి పోరు
Published Wed, Dec 18 2013 2:53 AM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM
Advertisement
Advertisement