అభివృద్ధికి విపక్షాలే అడ్డు : సీఎం
► పోలవరం పూర్తిచేసే అవకాశం పూర్వజన్మ సుకృతం
► ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించడం హర్షణీయం
► పేరు కోసం తాపత్రయం తప్ప నాకేం స్వార్థం లేదు
► ప్రతిపక్ష నాయకులకు ఏబీసీడీలు కూడా తెలియవు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘అభివృద్ధి చేస్తుంటే రాళ్లు వేయడం చాలా ఈజీ.. అయినా నేనెవ్వరికీ భయపడను. నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే. అందుకే చెబుతున్నా... ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రతిపక్షాలే అడ్డు. నేనెంతో కష్టపడుతుంటే అన్నింటా అడ్డు తగులుతున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. ఇంత పెద్ద ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేస్తాం. కేవలం పేరు కోసం తాపత్రయం తప్ప నాకెలాంటి స్వార్థం లేదు’’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఆయన మంగళవారం భారత ఆర్థిక సంఘం సదస్సు నుంచి వెలుపలకు వచ్చాక మీడియాతో మాట్లాడారు.
పోలవరం పూర్తి చేస్తాం...
1941–42 నుంచే నిర్మించాలనుకుని కలలు గన్న పోలవరం ప్రాజెక్టును 2018లో గా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏళ్ల తరబడి నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు మోక్షం లభించడం, కేంద్రం నాబార్డు ద్వారా రూ.1981 కోట్లు అందజేయడం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఘట్టమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7.20 లక్షల అదనపు ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. అంతేకాకుండా కృష్ణా, గోదావరి డెల్టాల స్థిరీకరణ సాధ్యమవుతుందనీ, విశాఖపట్నం జిల్లాకు 24 టీఎంసీల నీటిని మళ్లించే వీలుందని వివరించారు. పేరున్న బావర్, ఎల్ అండ్ టీ, త్రివేణి, ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలకు పనులు అప్పగించామన్నారు.
దేశంలో పెద్ద గేట్లు ఈ ప్రాజెక్టుకు అమర్చుతున్నామనీ, 1128 మీటర్ల స్పిల్ వే పనులు, 48 గేట్లను ప్రాజెక్టు డిజైన్ చేశారని తెలిపారు. భారీ మిషనరీతో పనులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయన్నారు. ఈనెల 30న ప్రాజెక్ట్› కాంక్రీట్ పనులు, జనవరి 3న డయాఫ్రం పనులు, 14న స్పిల్‌వే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. 2010–11 అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.1610 కోట్లు కాగా, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాక అంచనాలు పెరిగాయన్నారు. ఇప్పటివరకూ రూ.8,683 కోట్లు ఖర్చుకాగా, కేంద్రం రూ.935 కోట్లు ఇచ్చిందన్నారు. సోమవారం ఢిల్లీ వెళ్లి రూ.1981.54 కోట్ల చెక్కు తెచ్చామని తెలిపారు. తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పోలవరం ప్రాజెక్టు కోసం శ్రమిస్తోంటే ప్రతి పక్షం మాత్రం అడ్డంగా మాట్లాడుతోందని విమ ర్శించారు. వారికి రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా తెలియవన్నారు. సమావేశంలో మంత్రి బొజ్జల, ఎమ్మెల్యే సుగుణమ్మ, జెడ్పీ చైర్మన్ గీర్వాణి ఉన్నారు.