వర్సిటీలో నామినేషన్ల సందడి | Co-operative society elections in andhra university | Sakshi
Sakshi News home page

వర్సిటీలో నామినేషన్ల సందడి

Published Wed, Sep 28 2016 11:40 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

వర్సిటీలో నామినేషన్ల సందడి

వర్సిటీలో నామినేషన్ల సందడి

4న ఏయూ సహకార సంఘం ఎన్నికలు 
రేపు తుది జాబితా, గుర్తుల కేటాయింపు
 
ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి నామినేషన్ల సందడి నెలకొంది. వర్సిటీలో వచ్చే నెల 4న నిర్వహించనున్న ఉద్యోగుల సహకార సంఘ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించారు. మూడు విభాగాల్లో 13 డైరెక్టర్‌ పదవులకు 37 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి పెద్దసంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.   ఏ గ్రూప్‌ నుంచి 5 డైరెక్టర్‌ పదవులకు 7 దరఖాస్తులు, బీ గ్రూప్‌ నుంచి నాలుగు డైరెక్టర్‌పదవులకు 18 దరఖాస్తులు, సీ గ్రూప్‌ నుంచి 4 డైరెక్టర్‌ పదవులకు 12 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం దరఖాస్తుల పరిశీలన, తిరస్కరణ జరుగుతుంది. గురువారం గుర్తుల కేటాయింపు, తుది జాబితా విడుదల చేస్తారు. అక్టోబర్‌ 4వ తేదీన ఏయూ పాఠశాలలో ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ జరిపి సాయత్రం ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

ఏ గ్రూప్‌ ఏకగ్రీవమయ్యే అవకాశం
మూడు విభాగాలలో డైరెక్టర్ల ఎంపిక జరుగుతుంది. ఏ గ్రూప్‌లో వర్సిటీ ఆచార్యులు, పాఠశాల అధ్యాపకులు ఉంటారు. ఈ విభాగంలో ఐదు డైరెక్టర్ల పదవులకు కేవలం 7 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీరిలో ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీ గ్రూప్‌లో క్లరికల్‌ స్టాఫ్‌ నుంచి అత్యధికంగా 18 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. ఇక సీ గ్రూప్‌లో నాల్గో తరగతి, టెక్నికల్‌ సిబ్బంది నుంచి 12 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,100 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ దఫా ఎన్నికల్లో బి గ్రూప్‌ సభ్యుల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అధికశాతం మంది పోటీలో నిలవడానికి ఆసక్తి చూపుతున్నారు. 
 
ప్రచారం ప్రారంభం
ఐదేళ్ల కాలానికి డైరెక్టర్లుగా ఎంపిక కావడానికి వర్సిటీ ఉద్యోగులు ఉవ్విళ్లూరుతున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓట్లను బేరీజు వేసుకుంటూ సాగుతున్నారు. తమ సామాజిక వర్గాల ఓట్లు తమకు వచ్చే దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు వర్సిటీలో ప్రచారం ప్రారంభించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. గురువారం నుంచి ప్రచారం పూర్తిస్థాయిలో ఊపందుకుంటుంది. ఎన్నికల గుర్తులు కేటాయిస్తే అభ్యర్థులు పూర్తిస్థాయిలో తమ గుర్తులతో ప్రచారం జరుపుతారు.

జోరు వానలోనూ..
జోరుగా వర్షం కురుస్తున్నా వర్సిటీలో ఎన్నికల హోరు వినిపించింది. ఉదయం నుంచి అభ్యర్థులు స్థానిక పోలమాంబ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపి ర్యాలీగా సహకార సంఘానికి చేసుకున్నారు. ఏయూలోని సీఆర్‌ రెడ్డి విగ్రహానికి, ఇతర నాయకుల విగ్రహాలు పూలమాలలు వేసి నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లారు. కొంతమంది భారీ ఊరేగింపుతో,  డప్పులతో తమ బలాన్ని ప్రదర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement