డాన్సర్ మోహనాంబాల్, ఆమె ఇంటికి సీల్ వెస్తున్న పోలీసు అధికారులు (పాత చిత్రం)
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో 15 రోజులుగా పరారీలో ఉన్న కరగ డాన్సర్ మోహనాంబాల్ సోమవారం ఉదయం వేలూరు కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించారు. వేలూరు సమీపంలోని వసంతపురానికి చెందిన మోహనాంబాల్ కరగ డాన్సర్‌గా ఉండేవారు. ఈమె కాట్పాడి తారాపడవేడు గోవిందస్వామి వీధిలో అద్దె ఇంట్లో కాపురం ఉండేవారు. గత నెల 25వ తేదీన మోహనాంబాల్ ఇంట్లో తనిఖీలు చేయగా రూ. 4 కోట్ల 4 లక్షల నగదు, 73 సవర్ల బంగారం ఉన్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన నగదు ఉంచిన కేసులో మోహనాంబాల్, ఆమె సోదరి నిర్మల, సోదరుడు శరవణన్‌ను 15 రోజులుగా మూడు ప్రత్యేక పోలీస్ టీమ్‌లు గాలిస్తున్నాయి.
అయినా వారి ఆచూకీ తెలియలేదు. చెన్నై, నెల్లై, ఆంధ్ర తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గత నెల 27వ తేదీన మోహనాంబాల్ కాలుకు ఆపరేషన్ చేసినట్లు తెలిసింది. ఆపరేషన్ ముగిసిన వెంటనే 28వ తేదీన ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న మోహనాంబాల్, శరవణన్‌లు జామీన్‌పై బయటకు తీసుకొచ్చేందుకు చెన్నై హైకోర్టులో బంధువులు ప్రయత్నం చేశారు. ఇందుకు చెన్నై హైకోర్టు వేలూరు కోర్టులో జామీను పొందాలని న్యాయమూర్తి సూచించారు.
సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మోహనాంబాల్, సోదరి నిర్మల వేలూరు కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి ప్రభాకరన్ వద్ద జామీన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు జామీన్ ఇవ్వకూడదని పోలీసు తరపు న్యాయవాది వాదించారు. దీంతో మూడు రోజులు పోలీస్ కస్టడీ పూర్తిచేసి కాట్పాడి కోర్టులో ఈ నెల 11వ తేదీన హాజరు పరచాలని జడ్జి ఆదేశించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ పోలీసులు వారిని మహిళా సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.
వీల్‌చైర్‌లో వచ్చిన మోహనాంబాల్
కాలుకు శస్త్ర చికిత్స చేయడంతో మోహనాంబాల్ కోర్టుకు వీల్ చైర్‌లో వచ్చారు. ఆ సమయంలో వీల్ చైర్‌లో ఎందుకు వచ్చావని న్యాయమూర్తి ప్రశ్నిం చారు. మోకాలు నొప్పి కారణంగా ఆపరేషన్ చేసుకున్నానని, నొప్పి ఉండడంతోనే వీల్ చైర్‌లో వచ్చానని మోహనాంబాల్ వివరణ ఇచ్చారు. తనకు విద్యా జ్ఞానం లేని కారణంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించడం తెలియలేదని, ఎంత పన్ను కట్టాలని తెలిపితే వెంటనే చెల్లిస్తానని మోహనాంబల్ తెలిపారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బు కావడంతో తనపై ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని ఆమె వేడుకున్నారు.