మాఫియా డాన్ దావూద్ ఆస్తులు వేలం
ముంబయి: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల అమ్మకం ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. దావూద్‌కు సంబంధించి ముంబైలో ఉన్న ఆస్తులను వేలం వేస్తున్నారు. సౌత్ ముంబయిలోని డిప్లమాట్ హోటల్‌లో వేలం ప్రక్రియ జరుగుతోంది. దావూద్‌కు ముంబైలో కోట్లాది రూపాయల విలువైన ఏడు ఆస్తులున్నాయి. ఇందులో ముంబైలో మూడు , నగర శివార్లలో నాలుగు రకాల ఆస్తులున్నాయి. భారత్ నుంచి దావూద్ పారిపోయిన తర్వాత అతని ఆస్తులు సీజ్ చేసిన అధికారులు ఇవాళ వేలం వేస్తున్నారు. ఈ వేలంలో న్యాయవాది అజయ్ శ్రీవాత్సవ, మాజీ జర్నలిస్ట్ బాలకృష్ణన్ పాటు హిందూమహాసభ ప్రతినిధి స్వామి చక్రపాణి, పలువురు బిల్డర్స్ పాల్గొంటున్నారు.
కాగా దక్షిణ ముంబైలోని పక్ మోడియా వీధిలోని ‘రౌనక్ అఫ్రోజ్’ అనే హోటల్ భవనానికి వేలం జరుగుతోంది. ఈ హోటల్ విలువను ప్రభుత్వం రూ. 1.18 కోట్లుగా నిర్ణయించింది. భవనాన్ని కొనుగోలు చేసేందుకు బాలకృష్ణన్ తన ఎన్‌జీవో సంస్థ అయిన ‘దేశ్ సేవ సమిత్’ (శిశు సంక్షేమం, స్త్రీ సాధికారతకోసం పనిచేస్తోంది) తరపున బిడ్డింగ్ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు వేలం ప్రక్రియ జరుగుతున్న హోటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు డీసీపీ ధనుంజయ్ కుల్కర్ణి తెలిపారు. కాగా వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ దావూద్ సోదరి హసీనా పార్కర్ కోర్టును ఆశ్రయించగా, కేసు తదుపరి విచారణ 18కి వాయిదా పడింది.