ఇదా.. మార్పు!?
Published Sun, Dec 15 2013 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
రోజుకు సగటున 4 అత్యాచారాలు జరిగాయి. 9 మంది మహిళలు వేధింపులకు బలయ్యారు. గత 13 సంవత్సరాల్లో ఈ ఏడాదే ఎక్కువగా దారుణాలు జరిగాయి. 2012తో పోలిస్తే అత్యాచారం కేసులు రెట్టింపయ్యాయి. వేధింపుల కేసులు ఆరింతలయ్యాయి. ఇవన్నీ నిర్భయ అత్యాచారం జరిగిన తర్వాత నమోదైన కేసులే. పోలీసుల ముందుకొచ్చి చెప్పిన దారుణాలే ఇన్నైతే.. వెలుగు చూడని దారుణాలు మరెన్నో..! ఈ కీచకపర్వం ఆగదా? ఇలాగే జరిగితే ‘అతివ’ అంతమైపోదా? సమాజంలో మహిళలు కోరుకుంటున్న మార్పు ఇదేనా?
న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత ఈ దారుణాన్ని ఖండిస్తూ పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, పోలీసుల్లో కదలిక వచ్చింది. ఇకపై ఇటువంటి దారుణాలను జరగనీయమంటూ ఎప్పటిలాగే రాజకీయ నాయకులు హామీలిచ్చారు. మరోవైపు పోలీసులు కూడా మహిళా భద్రతకే ఇకపై అత్యధిక ప్రాధాన్యమిస్తామని, అందుకోసం ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో చెప్పి, భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ఏడాది గడిచింది. మరి రాజకీయ నాయకులు ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరింది? పోలీసులు కల్పించిన భరోసా మహిళల ఆత్మస్థైర్యాన్ని పెంచిందా? నిజంగా ఆశించిన మార్పు నగరంలో వచ్చిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వింటే నివ్వెరపోవాల్సి వస్తోంది.
ఎందుకంటే ఈ ఏడాది కాలంలో అత్యాచారాలు ఆగకపోగా రెట్టింపయ్యాయి. ఇక మహిళలపై వేధింపులు ఏకంగా ఆరింతలు పెరిగాయి. రోజుకు సగటున నలుగురు అబలలు అత్యాచారానికి గురయ్యారు. తొమ్మిది మంది వేధింపులకు బలయ్యారు. ఈ వివరాలన్నీ ఎవరో చెప్పినవనుకుంటే ఏమో అనుకోవచ్చు. ఏడాది కాలంలో నగరంలో 1,493 అత్యాచార కేసులు నమోదయ్యాయని, 3,237 వేధింపుల కేసులు నమోదయ్యాయని స్వయంగా ఢిల్లీ పోలీసులే వెల్లడించారు. గత పదమూడేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా ఇటువంటి దారుణాలు జరిగాయి. పోలీసుల దృష్టికి వచ్చిన అఘాయిత్యాలే ఇన్ని ఉంటే.. ఇక స్టేషన్ వరకు వచ్చి తమకు జరిగిన దారుణం గురించి చెప్పుకోని బాధిత మహిళలెంతమంది ఉంటారో ఊహించుకునేంటే ఆందోళనపడక తప్పదు.
ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు...
జరుగుతున్న దారుణాల విషయం అలా ఉంచితే ఢిల్లీ పోలీసులు మాత్రం కేసులు పెరుగుతున్న తీరును సమర్థించుకుంటున్నారు. తమకు జరిగిన దారుణం గురించి మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే ఈ ఏడాది కేసుల సంఖ్య ఇంతగా పెరిగిందని చెబుతున్నారు. ఇది నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని చెప్పడానికి ఉదాహరణగా చెబుతున్నారు. కేసుల నమోదు చేసినప్పుడే నేరగాళ్లపై చర్యలు తీసుకోవడానికి అవకాశముంటుందంటున్నారు. గతంలో కూడా ఇంతకుమించి దారుణాలు జరిగాయని, అయితే పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు సాహసించకపోవడంతో కేసులు సంఖ్య గతంలో తక్కువగా కనిపించేదన్నారు. స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్ డెస్క్‌కు వస్తున్న ఫిర్యాదు సంఖ్య 60 నుంచి 100 శాతం పెరిగిందంటున్నారు. మహిళల ఫిర్యాదుల విచారణ కోసం ప్రత్యేకించి ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇవీ పోలీసులు తీసుకున్న చర్యలు...
క్రైం ఎగెనైస్ట్ ఉమెన్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి మహిళలు దాఖలు చేసిన ఫిర్యాదులను ఇది విచారిస్తుంది. ఉమెన్ పోస్ట్ మెయిల్ ద్వారా బాధిత మహిళల నుంచి మెయిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, వెంటనే చర్యలు తీసుకుంటారు. ఆల్-ఉమె న్ పోలీస్ మొబైల్ టీమ్‌ను నియమించారు. ఇది 24 గంటలపాటు అవసరమైన సహకారాన్ని అందిస్తుం ది. అంతేకాక అత్యాచార కేసుల ప్రాథమిక విచారణ బాధ్యతలను మహిళా పోలీసులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహిళలు దాఖలు చేసిన ఫిర్యాదులను స్వీకరించి, వెంటనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని, మూడు నెలల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని ఇప్పటికే ఆదేశించారు. పీసీఆర్ వ్యాన్ల సంఖ్యను పెంచారు. నగరవ్యాప్తంగా 24 గంటల పాటు 850 పీసీఆర్ వ్యాన్లు నేరాలా నియంత్రణకు పనిచేస్తున్నాయి. బాలికల పాఠశాలలు, కాలేజీల బయట పోలీసులను నియమించారు. వినోద కేంద్రాల వద్ద కూడా 24 గంటలపాటు భద్రతను మోహరించారు. రాత్రి 8 గటల నుంచి ఒంటిగంట వరకు మాల్స్ తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘా పెడుతున్నారు. మహిళలకు ఆత్మరక్షణ కోసం ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. దీనిద్వారా కరాటే తదితర విద్యలను నేర్పుతున్నారు. పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లలో అవగాహన శిబిరాలను ఏర్పాటు చేసి మహిళా భద్రతపై మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఫలితమివ్వని చర్యలు..
అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నట్లుగా చెబుతున్నట్లుగా చర్యలు ఎటువంటి ఫలితమివ్వలేదని జాతీయ నేర గణాంకాల విభాగం వెల్లడించిన వివరాలే చెబుతున్నాయి. ఇప్పటికీ బస్సుల్లో జీపీఎస్‌ను ఏర్పాటు చేయలేదు. ఇక ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ 181కు ఆదరణ అంతంతమాత్రంగానే లభిస్తోంది. అందుకు కారణం ఒకవేళ ఫిర్యాదు చేసినా, సాయం కోసం అర్థించినా అక్కడి నుంచి స్పందన కొరవడడమేనని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ‘ఇప్పటికీ బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించాలంటే భయంగానే ఉంది. ఎక్కడా పీసీఆర్ వ్యాన్లు కనిపించడంలేవు. ఆటోవాలాలు సమీప దూరాలకు రావడానికి ఇంకా నిరాకరిస్తున్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ఏ వాహనాల్లో ఏర్పాటుచేశారో నాకైతే తెలియడంలేద’ని భావన తుతేజా అనే ఉద్యోగిని అభిప్రాయపడింది.
అదొక్కటే ఊరట...
నిర్భయపై జరిగిన దారుణానికి ఒకేఒక్క సాక్ష్యంగా మిగిలిన ఆమె స్నేహితుడు అవనీంద్ర పాండే ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాడు. దోషుల్లో నలుగురికి శిక్షపడడమొక్కటే తనకు ఊరట కల్పించిందని, మైనర్‌ను కూడా శిక్షించాల్సిందేనంటున్నాడు.
జనవరిలో తీర్పు వెలువడే అవకాశం...
నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు జనవరిలో తీర్పు వెలువరించే అవకాశముందని డిఫెన్స్ లాయర్ ఎంఎల్ శర్మ తెలిపారు. తమను దోషులుగా నిర్ధారిస్తూ సాకేత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement