న్యూ ఇయర్ కోసం భారీగా డ్రగ్స్.. పట్టివేత
న్యూ ఇయర్ కోసం భారీగా డ్రగ్స్.. పట్టివేత
Published Sat, Dec 24 2016 9:19 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
కొత్త సంవత్సర వేడుకల కోసం భారీ మొత్తంలో సిద్ధం చేస్తున్నట్లుగా భావిస్తున్న డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామ పరిధిలో వెంకట రాఘవ ల్యాబ్స్‌పై శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక దాడి చేశారు. మొత్తం రూ. 3.50 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు డ్రగ్స్ తయారీకి ఉపయోగించే నాలుగు రియాక్టర్లను సీజ్ చేశారు. ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ దాడులు చేశారు. దాదాపు 132 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కొంతకాలంగా బొల్లారం తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ వ్యాపారాన్ని కుటీర పరిశ్రమలా చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఒక రియాక్టర్ అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారుచేసిన వైనం గతంలో వెలుగు చూసింది. తాజాగా ఏకంగా ఒక ఔషధ ఫ్యాక్టరీలోనే డ్రగ్స్ తయారుచేసిన వైనం బయటపడింది. నిషేధిత డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 31 వస్తున్న నేపథ్యంలో పార్టీలలో వాడకానికి ఈ డ్రగ్స్ ఉపయోగిస్తారని సమాచారం అందింది. ఇలాంటి డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్లో గ్రాము 10 వేల వరకు విలువ చేస్తాయని, అందువల్ల ఒక్క హైదరాబాద్ మాత్రమే కాక ఇతర ప్రాంతాల్లో మార్కెట్ చేయడానికి దీన్ని తయారుచేస్తున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement