సాక్షి, హైదరాబాద్ : న్యూ ఇయర్ పార్టీలను టార్గెట్‌గా చేసుకుని మాదకద్రవ్యాలు విక్రయించడానికి కుట్ర పన్నిన ముఠాను హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నల్ల జాతీయుల్ని అరెస్టు చేసిన అధికారులు.. రూ.కోటి విలువైన 250 గ్రాముల కొకైన్, 30 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో ఈ స్థాయిలో మాదకద్రవ్యాలు దొరకడం ఇదే తొలిసారని ఇన్‌చార్జ్ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ గ్యాంగ్ నైజీరియా నుంచి డ్రగ్స్‌ను ఎయిర్ కార్గోలో ముంబైకి తీసుకువచ్చి అక్కడ వీటిని చాక్లెట్ల రూపంలోకి మార్చి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో హైదరాబాద్‌కు తరలిస్తోంది.
తక్కువ ధరకు కొంటూ..
స్వచ్ఛమైన కొకైన్‌ను అంతర్జాతీయ స్మగ్లర్లు 100 గ్రాములు 3.2 డాలర్లకు ఖరీదు చేస్తున్నారు. దీన్ని నైజీరియా, సౌతాఫ్రికాలకు తరలించి 32 డాలర్లకు విక్రయిస్తున్నారు. దీని ఖరీదు అమెరికాలో 300 డాలర్ల వరకు ఉంటుండగా.. భారత్‌కు వచ్చేసరికి 500 నుంచి 600 డాలర్లకు చేరుతోంది. గతేడాది అక్టోబర్‌లో ఘనాకు చెందిన మేసన్ లూకాస్ పర్యాటకæ వీసాపై ముంబైకి వచ్చాడు.
అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌లో భాగమైన లూకాస్ ముంబై నుంచి వస్త్రాలను నైజీరియాకు ఎక్స్‌పోర్ట్ చేసే దందా ప్రారంభించాడు. అలా పంపిన దుస్తుల్లో కొన్ని రిజెక్ట్ అయి తిరిగి వస్తున్నట్లు నమ్మిస్తూ వాటిలో మాదకద్రవ్యా లను పెట్టించి నైజీరియా నుంచి ఎయిర్ కార్గోలో రప్పించేవాడు. ఇలా వచ్చిన కొకైన్, హెరాయిన్‌ను ముంబైలో తీసుకుంటున్న లూకాస్ అక్కడ వాటిని చాక్లెట్ల రూపంలోకి మార్చేవాడు. ఇలా సీల్ చేసిన ప్యాకెట్లను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇక్కడున్న ఏజెంట్లకు అప్పగించేవాడు.
విక్రయాలు ‘చూసి’నేర్చుకున్న పెడ్లర్లు
నైజీరియాకు చెందిన అజహ్ జాన్ చుక్కూ 2015 జూలైలో స్టడీ వీసాపై సిటీకి వచ్చాడు. బంజారాహిల్స్‌లోని జహీరానగర్‌లో ఉంటూ తరచు పబ్స్‌కు వెళ్లే ఇతనికి కెన్యా జాతీయుడైన డేవిస్ చరిస్ రిచర్డ్ ముల్లెర్‌తో పరిచయమైంది. అప్పటికే డ్రగ్స్ దందా చేస్తున్న ముల్లేర్ నుంచి కొద్ది మొత్తంలో కొకైన్‌ను ఖరీదు చేసి వాడటం మొదలెట్టాడు.
డ్రగ్స్ ఖరీదు చేయడానికి అవసరమైన డబ్బు కోసం జాన్ ఓ పెడ్లర్‌గా మారాడు. అలాగే నైజీరియాకే చెందిన బెర్నార్డ్ విల్సన్ గతేడాది జూన్‌లో స్టూడెంట్ వీసాపై సిటీకి వచ్చి టోలిచౌకిలోని సన్‌సిటీలో నివసిస్తున్నాడు. ఇతడికి నల్ల జాతీయుడైన చార్లెస్‌తో పరిచయమైంది. అప్పటికే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న చార్లెస్ విలాసాలను చూసిన విల్సన్ కూడా అదే దందా ప్రారంభించాడు.
గతంలోనే పోలీసులకు చిక్కిన ద్వయం
మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న చుక్కూ ఈ ఏడాదే జూబ్లీహిల్స్ పోలీసులకు చిక్కాడు. విల్సన్‌ను సైతం ఇదే తరహా కేసుల్లో గతేడాది గోల్కొండ పోలీసులు, ఈ ఏడాది నాంపల్లి ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లో అరెస్టయిన సమయంలో చుక్కూ.. పాట్రిక్ విలియమ్స్ ఉజోనా పేరుతో ఉన్న నకిలీ పాస్‌పోర్ట్ దాఖలు చేశాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వీరిద్దరికీ కొన్నాళ్ల క్రితం పరిచయం కావడంతో ఇరువురూ కలసి డ్రగ్స్ దందా ప్రారంభించారు.
వీరిని హైదరాబాద్‌లో పెడ్లర్లుగా ఏర్పాటు చేసుకున్న లూకాస్ కొన్నాళ్లుగా డ్రగ్స్ తీసుకువచ్చి సరఫరా చేస్తున్నాడు. సిటీకి వచ్చిన ప్రతిసారీ బంజారాహిల్స్‌లోని చుక్కూ రూమ్‌లో ఉండేవాడు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండటంతో భారీ డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంలో వీరిద్దరూ లూకాస్‌కు పెద్ద ఆర్డర్ ఇచ్చారు. దీంతో 250 గ్రాముల కొకైన్, 30 గ్రాముల హెరాయిన్ తీసుకుని అతడు గురువారం సిటీకి చేరుకున్నాడు.
దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, వి.కిషోర్, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుల్ లోకేశ్వరరావు చుక్కూ ఇంటిపై దాడి చేశారు. అక్కడే ఉన్న లూకాస్, చుక్కూ, విల్సన్‌లను అరెస్టు చేసి డ్రగ్స్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.
వేడుకల్లో జాగ్రత్తగా ఉండండి
ఇలాంటి ముఠాలు మరికొన్ని న్యూ ఇయర్ వేడుకల్ని టార్గెట్ చేసినట్లు సమాచారం ఉంది. వారి కోసమూ గాలిస్తున్నాం. ఈవెంట్స్ నిర్వహించే పబ్స్, రెస్టారెంట్స్, ఇతర నిర్వాహకులు సైతం డ్రగ్స్ క్రయవిక్రయాలపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ ముఠా ఎవరెవరికి మాదకద్రవ్యాలు విక్ర యిస్తుందనేది ఆరా తీస్తున్నాం. ముఖ్యం గా వీటికి సంబంధించిన మూలాలపై ఎక్కువ దృష్టి పెట్టాం.
– వీవీ శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్ సీపీ
Comments
Please login to add a commentAdd a comment