- కాల్బాదేవి మృతుల కుటుంబాలకు చేయూత
- కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
- గాయపడ్డవారికి బీఎంసీ సొంత ఖర్చుతో వైద్యం
- వెల్లడించిన కమిషనర్ అజయ్ మెహతా
సాక్షి, ముంబై: కాల్బాదేవిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ముంబై అగ్నిమాపక దళం రీజియన్ అధికారి సంజయ్ రాణే కొడుకు రాజ్, అగ్నిమాపక కేంద్రం అధికారి మహేంద్ర దేశాయి సతీమణి మానసీకి బీఎంసీలో ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కమిషనర్ అజయ్ మెహతా వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన జవాన్ల వైద్యానికయ్యే ఖర్చు కూడా బీఎంసీ భరిస్తుందని చెప్పారు. ఇద్దరు అధికారుల పిల్లల చదువులకయ్యే ఖర్చు, శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయాలని పరిపాలన విభాగానికి ఆయన ఆదేశించారు. విధి నిర్వహణలో ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలను ఆదుకోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఇందుకోసం అన్ని విధాల సాయం చేస్తామని మెహతా వెల్లడించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ నియమించామని అన్నారు. మూడు వారాల్లో కమిటీ నివేదిక అందజేస్తుందని చెప్పారు.
రాజ్ ఠాక్రే పరామర్శ
కాల్బాదేవిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న అగ్నిమాపక అధికారులు, జవాన్లను మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పరామర్శించారు. మంగళవారం ఉదయం నవీముంబై ఐరోలిలోని బర్న్ ఆస్పత్రికిలో గాయపడిన సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను కలిశారు. మృతి చెందిన ఇద్దరు అధికారుల కుటుంబ సభ్యులతో ఠాక్రే భేటీ అయ్యారు. ప్రభుత్వంతో చర్చించి బీమా పాలసీ, ఇల్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాల్బాదేవిలోని వందేళ్ల పురాతన గోకుల్ భవనానికి శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటలార్పే ప్రయత్నంలో ఇద్దరు వృుతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిలో 50 శాతం గాయాలైన సునీల్ నేస్రికర్, 90 శాతం కాలిన సుధీర్ అమిన్ ఆరోగ్యం విషమంగా ఉందని, వీరిన 24 గంటలు ప్రత్యేక వైద్యులృబందం పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్న డాక్టర్ సునీల్ కస్వాణి చెప్పారు.
ఆడిట్‌పై అధికారుల నిర్లక్ష్యం
సాధారణంగా 15 ఏళ్ల కంటే పురాతన, ప్రమాదకర భవనాలను స్ట్రక్చరల్ ఆడిట్ చేయించుకోవాలని బీఎంసీ నోటీసులు జారీ చేస్తుంది. ఆడిట్ నివేదికను సొసైటీ యాజమాన్యాలు బీఎంసీకి అందజేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నివేదిక సమర్పించని వారిపై బీఎంసీ కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆడిట్ నామమాత్రంగా జరుగుతోంది. దీంతో స్ట్రక్చరల్ ఆడిట్ నివేదిక సమర్పించే బాధ్యతలను ఐఐటీలో శిక్షణ పొందిన ఇంజినీర్ల ద్వారా సేకరించాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కూడా పాత భవనాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
పాత భవనాలకు స్ట్రక్చరల్ ఆడిట్
కాల్బాదేవిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కళ్లు తెరిచింది. నగరంలోని పాత, శిథిలావస్థకు చేరుకున్న భవనాలను ‘స్ట్రక్చరల్ అండ్ ఫైర్ ఆడిట్’ చేయాలని నిర్ణయం తీసుకుంది. రహదారులపై మూసుకుపోయిన ‘హైడ్రంట్’ పరికరాలను మళ్లీ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ ముంబైలోని కాల్బాదేవిలో వందేళ్లనాటి గోకుల్ నివాస్ భవనంలో శనివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ రీజినల్ అధికారి సంజయ్ వామన్, భాయ్‌కళా అగ్నిమాపక కేంద్రం చీఫ్ మహేంద్ర దేశాయి మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీఎం ఫడ్నవీస్ బీఎంసీని ఆదేశించారు. దీంతో ఇలాంటి సంఘటనలు పునరాృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. అందుకు స్ట్రక్చరల్ అండ్ ఫైర్ ఆడిట్ చేపట్టాలని నిర్ణయించింది. ఐఐటీలో శిక్షణ పొందిన ఇంజినీర్ల ద్వారా బీఎంసీ ఆడిట్ జరిపించనుంది. ఇందులో భాగంగా గోడలు, భవన నిర్మాణాలకు వాడిన ఇనుప చువ్వలను పరీక్షించనున్నారు. మరోవైపు నగరంలోని ప్రమాదాలు నివారించడానికి నీటి సరఫరా చేసే ‘హైడ్రంట్’ పరికరాలను తిరిగి ప్రారంభించాలని చూస్తోంది.
అన్ని విధాల ఆదుకుంటాం
Published Tue, May 12 2015 11:46 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement