వైద్య విద్యార్థిని నిరంజన
వేలూరు(తిరువణ్ణామలై): తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని కొసపాళ్యం గ్రామానికి చెందిన న్యాయవాది మూర్తి కుమార్తె నిరంజన. చైనాలోని షాన్‌డాంగ్ యూనివర్సిటీలో డాక్టరు కోర్సు మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమె గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ఇండియా నుంచి చైనాకు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ వల్ల అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. చైనాలో మెడిసిన్ చదువుతున్న అన్ని తరగతులకు తేదీని ప్రకటించకుండా కళాశాలకు సెలవు ప్రకటించారు. అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరినీ ఇంటికి పంపించేశారు. నిరంజన చైనా నుంచి శనివారం ఉదయం చెన్నై విమానశ్రయానికి చేరుకొని, అక్కడ నుంచి సొంత గ్రామమైన ఆరణికి వచ్చింది.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను చదువుతున్న కళాశాలలో ఇండియా నుంచి మొత్తం 250 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారని తెలిపింది. తమిళనాడు నుంచి వంద మంది చదువుతున్నారని తెలిపింది. మొదటి సంవత్సరంలో తనతో పాటు మరో ముగ్గురు చదువుతున్నారని, కరోనా వైరస్ సోకక ముందే సెలవులు ప్రకటించడంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే ఈనెల 24వ తేదీన మెడిసిన్ చదువుకు నమోదు చేయాల్సి ఉండడంతో తాము అక్కడ ఉన్నామని, ప్రస్తుతం తమకు కూడా సెలవు ప్రకటించి మార్చిలో కళాశాలను ప్రారంభిస్తామని తేదీని కూడా తెలపకుండా పంపించేశారని తెలిపింది. తమను కరోనా వైరస్ సంబంధమైన రక్త పరిశోధనలు చేసి అవసరమైన సంరక్షణా వస్తువులు ధరించి అక్కడ నుంచి పంపివేశారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment