'జ్యోతిర్లింగ క్షేత్రంగా శ్రీశైలం అభివృద్ధి'
అమరావతి: శ్రీశైల భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని ప్రసిద్ధ శక్తిపీఠం, జ్యోతిర్లింగ ఉమ్మడి క్షేత్రంగా అభివృద్ది చేయడానికి దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. రూ.1500 కోట్ల ఖర్చుతో ఆలయ విస్తరణకు ప్రణాళికను రూపొందించామన్నారు.
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని ఆయన ఛాంబర్లో బుధవారం విధులను చేపట్టారు. అంతకు ముందు లక్ష్మీ గణపతి, వాస్తు పూజలతో హోమం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శ్రీశైలంతో పాటు రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాలను తిరుమల తరహాలో అభివృద్ది చేస్తామన్నారు. విజయవాడ దుర్గ గుడి వద్ద గతంలో ఇరుకుగా ఉండే రాజవీధిని 100 అడుగుల వెడల్పుగా విస్తరిస్తామని మాణిక్యాలరావు చెప్పారు.
అన్నవరం, ద్వారక తిరుమల, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల అభివృద్దికి ప్రణాళిక తయారుచేస్తున్నామన్నారు. భక్తుడు ఇచ్చే కానుకలు, విరాళాలతోనే దేవాదాయ శాఖ నడుస్తోందని ఆయన అన్నారు. భక్తులు ఏ అంశంపై ప్రశ్నించినా జవాబు చెప్పేంతగా దేవాదాయ శాఖను పారదర్శకంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని మాణిక్యాలరావు చెప్పారు.