సాక్షి, చెన్నై: అజ్ఞాత తీవ్ర వాదులు ఫక్రుద్దీన్, బిలాల్, పన్నా ఇస్మాయిల్, అబూబక్కర్ సిద్ధిక్ తదితరులు రాష్ట్ర పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తూ వచ్చారు. మూడు నెలల క్రితం వేలూరులో హిందూ మున్నని ప్రధాన కార్యదర్శివెల్లయప్పన్, సేలంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రమేష్‌ను వీరు హతమార్చడంతో దర్యాప్తు వేగవంతం అయింది. నేర పరిశోధనా విభాగం డెరైక్టర్ నరేంద్ర పాల్ సింగ్ నేతృత్వంలో బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా గాలించాయి. ఎట్టకేలకు గత నెల నాలుగో తేదీ చెన్నైలో ఫక్రుద్దీన్, మరుసటి రోజు ఆంధ్ర రాష్ట్ర పుత్తూరులో ఇస్మాయిల్, బిలాల్‌ను బంధించడంతో రాష్ట్ర పోలీసుల పనితీరుపై ప్రసంశల జల్లులు కురిశాయి. చాకచక్యంగా వ్యవహరించిన అధికారులకు సీఎం ప్రమోషన్లు కల్పించారు. ఈ ఆపరేషన్‌లో రాత్రి పగలు శ్రమించిన సిబ్బందిని సత్కరించేందుకు నిర్ణయించారు. నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.
238 మందికి సత్కారం
నరేంద్ర పాల్ సింగ్ నేతృత్వంలోని 22 మంది అధికారుల బృందంలో 20 మందికి ప్రమోషన్లు దక్కాయి. వీరిని గత వారం సీఎం నగదు బహుమతులతో సత్కరించారు. మిగిలిన 238 మందిని మంగళవారం ఉదయం సచివాలయంలో సత్కరించారు. కానిస్టేబుళ్లు, వాహన డ్రైవర్లు, మహిళా పోలీసులు, అధికారులు ఇలా అందరికీ నగదు ప్రోత్సాహకాన్ని అందించి సత్కరించారు. 238 మందికి రూ.రెండు కోట్ల 53 లక్షలు బహుమతిగా అందజేశారు. పోలీసు శాఖకు సర్వాధికారాల్ని ఇచ్చామని గుర్తు చేస్తూ, సంఘ విద్రోహ శక్తుల్ని, నేరగాళ్లను ఉక్కు పాదంతో అణచి వేయాలని సూచించారు. చివరగా అందరు సీఎం జయలలితో కలసి గ్రూపు ఫోటోలు దిగి తమ ఆనందాన్ని పంచుకోవడం విశేషం.
కమిషన రేట్‌గా తిరుప్పూర్
తిరుప్పూర్ మంగళవారం పోలీసు కమిషనరేట్‌గా ఆవిర్భవించింది. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్త కమిషనరేట్‌ను సీఎం జయలలిత ప్రారంభించారు. గత ఏడాది కార్పొరేషన్‌గా తిరుప్పూర్ రూపుదిద్దుకుంది. తిరుప్పూర్ ఉత్తరం, దక్షిణం పేరుతో పోలీసు సేవలు అందిస్తూ వచ్చారు. ఈ రెండింటినీ ఒక్కటి చేసే రీతిలో కార్పొరేషన్ పరిధిలోని 60 వార్డుల్ని కలుపుకుంటూ కమిషనరేట్ ఏర్పాటుకు నిర్ణయించారు. రూ.17.49 లక్షల్ని ఇందుకు కేటాయించారు. కమిషనర్, ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు, ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లతో మొత్తం 30 మంది అధికారుల నియామకానికి చర్యలు తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో 326 మంది సాయుధ సిబ్బందిని నియమించనున్నారు. తిరుప్పూర్ సిరుపువ్వన పల్లి జంక్షన్‌లో కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. దీనిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత ప్రారంభించారు. తిరుప్పూర్ కమిషనరేట్‌లో పోలీసుల విధులు ఆరంభమవుతాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, హోం శాఖ కార్యదర్శి నిరంజన్ మార్టి, డీజీపీ రామానుజం, ఏడీజీపీలు టికే రాజేంద్రన్, కరన్ సిన్హా, పీ కన్నన్, మహేష్‌కుమార్ అగర్వాల్, ప్రత్యేక బృందం అధికారి నరేంద్ర పాల్ సింగ్, చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల సేవలు భేష్!
Published Wed, Nov 20 2013 3:17 AM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM
Advertisement