పేదలు, మహిళలకు మా పార్టీయే అండ సీఎం సిద్ధు చక్కగా పని చేస్తున్నారు బీజేపీది దుష్ర్పచారం
మా పార్టీని ఓడించడం ఎవరి తరమూ కాదు : రాహుల్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని పేదలు, మహిళలకు బీజేపీ హయాంలో రక్షణ లేకుండా ఉండేదని, కాంగ్రెస్ మాత్రమే వారికి అండగా నిలబడుతుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బెల్గాంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ దేశ అభివృద్ధి కోసం ఎవరూ ఏమీ చేయలేరని, కాంగ్రెస్ ద్వారా మాత్రమే అది సాధ్యమని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చక్కగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. కర్ణాటక అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని, పేదల సంక్షేమానికి పార్టీ ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు.
బీజేపీకి అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు లేదని, రెండు సార్లు యూపీఏ హయాంలోని సాధనలను ప్రజలకు చెప్పడాన్ని సహించలేక దుష్ర్పచారానికి దిగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యాంగానికి లోబడి పని చేస్తుందని, ఒక వ్యక్తి లేదా సమూహం నుంచి దేశాభివృద్ధి అసాధ్యమన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడం ఎవరి తరమూ కాదని, అన్ని వర్గాల ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. తమ పార్టీ హయాంలో మాత్రమే లౌకిక తత్వానికి రక్షణ ఏర్పడుతుందని చెప్పారు.
బీజేపీ అవినీతిమయం
అంతకు ముందు ప్రసంగించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవినీతి పరులతో నిండిపోయిన బీజేపీకి అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు లేదని దెప్పి పొడిచారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సహా అనేక మంది అవినీతిపరులు ఆ పార్టీలో ఉన్నారని ఆరోపిస్తూ, రాష్ర్టంలో బీజేపీ హయాంలో అవినీతికి హద్దు లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో అవినీతి బాగా తగ్గిపోయిందని, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మాత్రమే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించగలుగుతారని తెలిపారు.
నేడు తుమకూరులో...
రాహుల్ గాంధీ ఆదివారం తుమకూరులో జరిగే మహిళా సదస్సులో పాల్గొంటారు. బెల్గాంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. ఇక్కడి సెంట్రల్ కాలేజీ క్రికెట్ మైదానంలో నిర్మించిన ప్రత్యేక వేదిక నుంచి విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి బెంగళూరులోనే బస చేసి, ఆదివారం ఉదయం 10.30 గంటలకు తుమకూరుకు వెళతారు. అక్కడి నుంచి కుణిగల్, మద్దూరు, మండ్యల్లో రోడ్డు షోలు నిర్వహించి మైసూరు చేరుకుంటారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
Published Sun, Feb 16 2014 1:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement