ఆ యూజర్లకు జియో 25జీబీ అదనపు డేటా
ఆ యూజర్లకు జియో 25జీబీ అదనపు డేటా
Published Fri, Sep 8 2017 3:23 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM
సాక్షి, ముంబై : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ మార్కెట్‌లో దూసుకుపోతుంది. మరోవైపు టెల్కోలకు హడలెత్తిస్తూ డేటా ఆఫర్ల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా దేశీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండు ఇంటెక్స్ టెక్నాలజీ యూజర్లకు జియో అదనపు డేటా ప్రయోజనాలను ప్రకటించింది. ఇంటెక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అదనంగా 25జీబీ వరకు డేటాను అందించనున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. ఈ స్కీమ్ కింద జియో కనెక్షన్ వాడుతున్న ఇంటెక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికీ.. సాధారణంగా రూ.309 రీఛార్జ్ లేదా ఆపై రీఛార్జ్‌లపై పొందే మొత్తాలకంటే అదనంగా ఒక్కో రీఛార్జ్‌పై 5జీబీ 4జీ డేటాను అందిస్తామని జియో తెలిపింది. ఇలా ఐదు రీఛార్జ్‌లపై జియో ఈ ఆఫర్ అందించనుంది.
ప్రపంచపు అతిపెద్ద జియో ఎండ్ టూ ఎండ్ ఐపీ నెట్‌వర్క్, ఇంటెక్స్ ప్యాన్ ఇండియా మొబైల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కలిసి వినియోగదారులకు ఈ సేవలందించనున్నట్టు ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్, బిజినెస్ హెడ్ నిధి మార్కెండేయ చెప్పారు. గత నెలలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో కూడా జియోతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ భాగస్వామ్యం మేరకు ఒప్పో స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకూ జియో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుచేసి, జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఎన్‌రోల్ చేసుకుంటే, అదనపు డేటా ప్రయోజనాలు జియో ఆఫర్ చేస్తోంది. ఆ కొత్త ఆఫర్ కింద ఒప్పో ఎఫ్3, ఎఫ్3 ప్లస్, ఎఫ్1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు అదనంగా ఒక్కో రీఛార్జ్‌పై 10జీబీ వరకు డేటాను ఉచితంగా అందిస్తోంది. మరోవైపు ఒప్పో ఎఫ్1ఎస్, ఏ37, ఏ33 మోడల్స్‌కు 7జీబీ వరకు అదనపు డేటాను ఇస్తోంది. ఆరు జియో రీఛార్జ్‌లపై కంపెనీ ఈ అదనపు ప్రయోజనాలను ఒప్పో యూజర్లకు అందించనుంది.
Advertisement